Sunday, April 28, 2024

అడిగింది కొండంత.. ఇచ్చింది గోరంత!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఓవైపు కొత్త కేసులు పెరుగుతున్నా.. మరోవైపు జోరుగా వ్యాక్సిన్ లు వేస్తున్నారు. టీకా వచ్చిన కొత్తలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు భయ పడిన ప్రజలు.. ప్రస్తుతం టీకాల కోసం బారులు తీరుతున్నారు. మొన్నటి వరకు స్టోర్ రూంలో మూలిగిన టీకాలు ఇప్పుడు నిండుకున్నాయి. జనాలు ఎగబడడంతో టీకా నిల్వలు తగ్గిపోయాయి. మరో రెండు రోజులు గడిస్తే టీకా కేంద్రాల ముందు నో స్టాక్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైద్యవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టీకాలు లేక వ్యాక్సిన్ కేంద్రాలను మూసివేశారు. టీకాలు పంపిణీ చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం.. రెండు రాష్ట్రాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేసింది.

ఏపీలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో టీకా నిల్వలు నిండుకుంటున్నాయని, వెంటనే టీకాలు పంపించాలని సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయానికి 4.40 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్ లు చేరాయి. 37 బాక్స్లలో ప్రత్యేకంగా భద్రపరిచిన వ్యాక్సిన్ను ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక ఏసీ కంటైనర్లో గన్నవరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తరలించారు. అక్కడి నుంచి రాత్రికి 13 జిల్లాల్లోని టీకా స్టోరేజ్ సెంటర్లకు వ్యాక్సిన్ను తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు.

ఏపీకి అత్యవసరంగా 25లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ఆ డోసులను పంపిస్తే ‘టీకా ఉత్సవ్’ ను ఘనంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అయితే, కేంద్రం మాత్రం 4.40 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్ లు మాత్రమే పంపిణీ చేసింది. సీఎం వైఎస్ జగన్ లేఖ రాసిన 24 గంటల వ్యవధిలోనే డోస్ లు రాష్ట్రానికి వచ్చాయని వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని తెలిపారు. టీకాలను అన్ని జిల్లాలకూ పంపించనున్నామని, 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా అందించేందుకు చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు.

మరోవైపు తెలంగాణకు కూడా కరోనా టీకాలు చేరాయి. నిన్న రాత్రి 4.64లక్షల డోసులను  రాష్ట్రానికి చెరాయి. కేంద్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 26.78 లక్షల డోసులు రాగా, ఇందులో 22.50 లక్షల డోసులు వేశారు. తాజాగా వచ్చిన డోసులతో కలిపి రాష్ట్రంలో 8.92లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఐదు రోజులకు మాత్రమే సరిపోతాయని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 15 రోజులకు సరిపడా కనీసం 30 లక్షల డోసులు పంపిణీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ స్వయంగా కేంద్ర ఆరోగ్యశాఖకు లేఖ రాశారు. ఇది రాసిన రెండురోజులకు స్పందించిన కేంద్రం సోమవారం రాత్రి కేవలం 4.64లక్షల డోసులను మాత్రమే పంపిణీ చేసింది.

వ్యాక్సిన్ల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం, 60శాతం పైగా వ్యాక్సిన్లు కేవలం 8 రాష్ట్రాలకే పంపిణీ అయ్యాయి. ఇందులో మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ పశ్చిమబెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ ఉన్నాయి. వ్యాక్సిన్ల పంపిణీలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్లకు కొరత ఉన్న నేపథ్యంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ టీకా వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదే తరహాలో మరో 4-5 వ్యాక్సిన్లు అనుమతుల కోసం చూస్తున్నాయి. ఇండియాలో టీకా కొరత వేధిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం టీకా డోసులను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముందుగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement