Monday, March 25, 2024

బా‌బు స‌భ‌లో రాళ్ల వ‌ర్షం – నాట‌కమ‌న్న మంత్రి పెద్దిరెడ్డి ‌

తిరుపతి, ప్రభన్యూస్‌బ్యూరో-: లోక్‌సభ ఉప ఎన్నికలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సోమవారం రాత్రి తిరుపతిలో చేపట్టిన రోడ్‌ షో లో రాళ్లదాడి జరిగింది. తనకే రక్షణ లేకపోతే సామాన్యుల గతేమిటంటూ మండిపడిన చంద్రబాబు సహచరులతో కలిసి నడిరోడ్డుపై బైఠాయించారు. అరగంట తర్వాత సమీపంలోని అర్బన్‌ ఎస్‌పి కార్యాలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్న చంద్రబాబు దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వక ఫిర్యాదు చేసారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్‌ ప్రభుత్వ గుండాయిజంకు నిదర్శనమని ఆరోపించారు. కాగా ఈ ఘటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయి విసరడాన్ని ఖండిస్తూనే ఓటమి భయంతో ఆడిన నాటకం లాగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అయినా ఎవరు రాయి విసిరారో తేల్చాలని పోలీసు అధికారులకు బహిరంగ విజ్ఞప్తి చేసారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం తిరుపతిలో రోడ్‌ షో చేపట్టారు. రైల్వేస్టేషన్‌ వద్ద నుంచి స్దానిక గాంధీరోడ్డులోని కృష్ణాపురం ఠాణా జంక్షన్‌ వద్ద ప్రచార వాహనంపై నుంచే సభ నిర్వహించారు. దాదాపు గంటన్నరసేపు కొనసాగిన సభలో తెలుగుదేశం నాయకులందరూ మాట్లాడిన తరువాత చంద్రబాబు ప్రసంగించారు. దాదాపు 45 నిముషాలపాటు కొనసాగిన సభ ముగిసే దశలో వాహనం ముందు నుంచి ఎవరో ఒకరు సార్‌ సార్‌ అంటూ కేకలు పెట్టారు. ప్రసంగాన్ని ఆపిన చంద్రబాబు ఏమిటని ప్రశ్నించగా ఎవరో రాళ్లు విసురుతున్నారని ఆ వ్యక్తి కేకలు పెట్టారు. వెంటనే ఆ రాయిని తన వద్దకు తెప్పించుకుని చంద్రబాబు జడ్‌ప్లస్‌ కేటగరి భద్రత ఉన్న తనకే రక్షణ కరవైతే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేసారు. వెంటనే పోలీసు అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసారు. ఆపై సహచరులతో కలిసి వాహనంపైనుంచి కిందకు రోడ్డుపై భైటాయించారు. ఆయనతో తెలుగుదేశం అభ్యర్ది పనబాక లక్ష్మి తదితర నాయకులు కూడా రోడ్డుపై బైఠాయించగా వందలాదిమంది కార్యకర్తలు ఇదేమీ రాజ్యం రౌడీరాజ్యం అంటూ నినాదాలు చేయడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆక్కడకు చేరుకున్న అదనపు ఎస్‌పి మునిరామయ్యపై తెలుగుదేశం నాయకులు విరుచుకుపడ్డారు. సభపై పడిన రాయిని చూపిస్తూ ముగ్గురు కార్యకర్తలకు గాయాలు తగిలాయని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు కేసు నమోదు చేసి ఎవరు రాళ్లు విసిరారోవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. ఈ దాడి వెనుక మంత్రి పెద్దిరెడ్డి, స్ధానిక ఎంఎల్‌ఎ కరుణాకరరెడ్డి మద్దతుదారుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తంచేసారు. వెంటనే విచారించి తగుచర్యలు తీసుకుంటామని మునిరామయ్య నచ్చచెప్పడానికి విఫలయత్నం చేసారు. అరగంటపాటు రోడ్డుపై బైఠాయించిన అనంతరం అక్కడికి సమాపంలోనే ఉన్న అర్బన్‌ ఎస్‌పిని కలిసి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు ఊరేగింపుగా బయలుదేరారు. అక్కడ ఎస్‌పి లేకపోవడంతో అదనపు ఎస్‌పి (అడ్మిన్‌) సుప్రజను కలిసి తమ రోడ్‌షోపై రాళ్ల వర్షం కురిపించినవారిని వెంటనే పట్టుకోవాలని చంద్రబాబు డిమాండ్‌చేసారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి రక్షణ కల్పించకపోవడం పోలీసు వైఫల్యమేనని, అధికారపార్టీ నాయకులకు తొత్తులుగా మారిపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చంద్రబాబు పోలీసు అధికారులపై విరుచుకుపడ్డారు. ఘటనలో తమ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలకు స్వల్పంగా గాయాలు తగిలాయని తెలిపారు.
తప్పక చర్యలు తీసుకుంటామని అమె హామీ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు లిఖితపూర్వక ఫిర్యాదు చేసి వెనుదిరిగారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు తన జీవితంగా ఎప్పుడూ చూడలేదని, స్వేఛ్చగా ప్రచారం చేసుకోడానికి కూడా లేకుండా చేయడం దారుణంగా ఉందన్నారు. ఘటనలో తమ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలకు స్వల్పంగా గాయాలు తగిలాయని తెలుగుదేశం నాయకులు తెలిపారు.

నాటకం లాగే ఉంది.. అయినా నిగ్గు తేలాల్సిందే : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రబాబు రోడ్‌షో సభ సందర్బంగా ఎవరో రాళ్లు విసి రినట్టు చెబుతున్న ఘటన వెనుక ఏదో నాటకం ఉన్నట్టు కనిపిస్తోందని, అయినా కూడా ఎవరు రాళ్లు విసిరారో తెల్చాలని పోలీసు అధికారులను తాను కోరుతున్నానని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సోమవారం రాత్రి స్దానిక వైఎస్సార్‌కాంగ్రెస్‌ ఎన్నికల కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సందర్బంగా దాడి ఎవరిపై ఎవరు చేసినా ఖండించాల్సిందేనన్నారు. కానీ దాడికి ముఖ్యమంత్రిని, తనను, తమ పార్టీ నాయకులను బాధ్యులుగా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి రాయి పడినట్టు చంద్రబాబుకు కూడా తెలియదన్నారు. కేవలం సభా వేదిక ముందున్న ఓ కార్యకర్త సార్‌ సార్‌ అని అరుస్తున్నా పట్టించుకోని చంద్రబాబు తాట ఒలుస్తా, తోలు తీసేస్తా అంటూ ప్రసంగిస్తూనే ఉన్నారని, ఎవరో చెప్పడంలో ప్రసంగాన్ని ఆపి ఏం జరిగిందని అడిగి కింద నుంచి ఎవరో రాయిని ఇస్తే తీసుకుని తమపై రాళ్ల వర్షం కురిపించారని ఆరోపించడం ప్రారంభించార న్నారు. ఈ మేరకు విడియో ను కూడా ఆయన సెల్‌ ఫోన్‌లో ప్రదర్శించారు. ఈ ఘటన తీరును గమనిస్తే ఓటమి భయంతో ఏదోవిధంగా లబ్ది పొందాలనే తెలుగుదేశం వారే రాయి డ్రామా ఆడారేమో అని అనుమానం కూడా కలుగుతోందన్నారు. ఓడిపోయే పార్టీవారి ప్రచార సభపై రాళ్లు విసరడం వల్ల తమకు ఒరిగేదేముంటుందని ఆయన ప్రశ్నించారు. అయినా పనికట్టుకుని పడిందో లేదో తెలియని రాయిని చూపిస్తూ నడిరోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నాటకాలు ఆడడం విడ్డూరంగా ఉందన్నారు. ఘనవిజయం సాధించపోయే తమ పార్టీ ఇటువంటి పనులకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. అయినా కూడా ఫిర్యాదుతో సంబంధం లేకుండా సభకు సమీపంలోని ఇళ్లవారిని విచారించి ఎవరు రాళ్లు విసిరారో, నిజంగా విసిరారా లేదా అనే అంశాల నిగ్గు తేల్చాలని తాను పోలీసు అధికారులకు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement