Friday, May 3, 2024

ఎర్రబెల్లికి కరోనా పాజిటివ్‌.. ఐసొలేషన్ లో మంత్రి..

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా సోకింది. కొంచెం నలతగా ఉండటంతో శనివారం సాయంత్రం పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో మంత్రి వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్ళారు. డాక్ట‌ర్ల‌ను సంప్రదించి, తగు మందులు తీసుకుంటూ జాగ్రత్త వహిస్తున్నారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర రైతుల ప్రయోజనార్థమై వారు పండించిన ధాన్యం, బియ్యం కేంద్రం కొనుగోలు చేయడంపై రాత పూర్వక హామీ కోసం నాలుగు, ఐదు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసిన నేపథ్యంలో తనకు కరోనా వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.

అయితే.. గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వాళ్లు పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు వహిస్తూ వీలైనంత వరకు హోం క్వారంటైన్ లో ఉండాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో అధికారులు, పి ఏ లు ఉండ‌నున్నారు. తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఎవరూ తనను కలవడానికి రావద్దని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.

తను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఇటు హైదరాబాద్ లో, అటు హన్మకొండ, పాలకుర్తి ఇతర మండల కేంద్రాల్లో అధికారులు, పీ ఏ లు అందుబాటులో ఉంటారని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement