Thursday, May 2, 2024

కాంగ్రెస్ లో టీ.పీసీసీ అగ్గి.. రాజీనామా బాటలో సీనియర్లు!

తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పదవి అగ్గి రాజేసింది. ఎంతో ఉత్కంఠ నెలకొన్న పీసీసీ అధ్యక్ష పీఠం ఎట్టకేలకు ఎంపీ రేవంత్‌రెడ్డిని వరించింది. దీంతో పార్టీలో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు బహిర్గతం అయ్యాయి. పీసీసీపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నాయకులు రాజీనామాల బాట పట్టారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించడాన్ని కొందరు నేతలు తీవ్రంగా తప్పుబట్టుతున్నారు. బయటి నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చి.. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన నేతలకు అన్యాయం చేస్తారా? అని హైకమాండ్‌పై గుర్రుగా ఉన్నారు.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించిన కాసేపటికే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్) పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో చాలా మంది కూడా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారని గత 10 రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచే సీనియర్లు తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. అయితే, పార్టీ తుది నిర్ణయం ప్రకటించే వరకు వేచి చూశారు. ఇప్పుడు అధికారికంగా రేవంత్ పేరు ప్రకటించడంతో పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు.

పీసీసీ రేసులో తొలినుంచి రేవంత్ రెడ్డే ఉన్నారు. ఆయనతోపాటు ఎంపీ కోమటిరెట్టి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇలా చాలా మంది పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక, పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అయితే, రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యవతిరేకించారు. కొన్ని రోజుల క్రితం ఆయన రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి పీసీసీ ఎలా ఇస్తారంటూ గతంలో చాలా సందర్భాల్లో ఫైర్ అయ్యారు. బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే.. తమ ఆత్మగౌరవం దెబ్బ తినదా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న లాయలిస్టులకే పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సాగనంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా పార్టీలోకొనసాగుతారా? లేక రాజీనామా బాట పడతారా? అన్నది ఉత్కంఠగా మారింది. అసలే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. రేవంత్ కు పీసీసీ వరించిన నేపథ్యంలో ఆయన గోడ దూకడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.

రేవంత్ పై పార్టీ సీనియర్ నాయకులు ఫిర్యాదులు చేసినా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఆయన వైపే మొగ్గుచూపింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. 2014 నుంచి రాష్ట్రంలో నేటి వరకు పార్టీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ప్రధానంగా నాయకత్వ లోపంతో పార్టీకి చేదు అనుభవాలు ఎదుర్కొంది. అంతేకాదు పార్టీలో గ్రూప్ రాజకీయాలు కూడా కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. దీంతో బీజేపీ బలం పెరిగిపోయింది. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది. ఉత్తమ్ రాజీనామా అనంతరం చాలా మంది పేర్లును అధిష్టానం పరిశీలించింది. నాయకుల అభిప్రాయాల సేకరణ అనంతరం ఎన్నో కూడికలు, తీసివేతలు చేసి అఖరికి రేవంత్‌ను ఎంపిక చేసింది.

తొలి నుంచి రేవంత్ కాంగ్రెస్ లో దూకుడుగానే ఉన్నారు. సమయం వచ్చినప్పుల్లా అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై మాటల దాడి చేసే వారు. కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా తనకే ఉందనే సంకేతాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కు పంపించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చిన్ని చిన్న విభేదాలు సహజమేనని.. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని చెప్పారు. పార్టీలో సీనియర్ నేతలందరినీ కలిసి వారి సలహాలు,సూచనలను తీసుకుంటామని తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తమ కుటుంబమని ఆయన చెప్పారు. కేఎల్ఆర్‌తో కూడా మాట్లాడతానని రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు ఎంపీ సీటు తనకు ఇవ్వాలని చెప్పిందే ఆయనని గుర్తు చేశారు. కానీ అంతలోనే పార్టీకి రాజీనామా ప్రకటించారు. అయితే, అసంతృప్తి నేతలను రేవంత్ ఎలా కలుపుకుని వెళ్తారు? అనేది చూడాలి.

- Advertisement -

ఇదీ చదవండి: వైఎస్సార్ ను కించపరిస్తే ఖబడ్దార్.. టీఆర్ఎస్ పార్టీకి షర్మిల వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement