Sunday, May 5, 2024

Monsoon | కరుణించిన వరుణుడు.. వారం రోజులు వానలే వానలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వర్షాలు కురవక సాగు ముందుకు కదలక నిరాశలో కూరుకుపోయి ఈ ఏడాది ఖరీఫ్‌ ఎవుసంపై ఆశలు వదిలేసుకుంటున్న రైతులకు హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తీపి కబురు చెప్పింది. వారం పాటు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న ‘ఆంధ్రప్రభ’కు తెలిపారు. రానున్న వారంపాటు అంటే ఈ నెల 26, 27 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వార్తలు కురుస్తాయని ఆమె చెప్పారు. అయితే బుధవారం కురిసిన వర్షాలు నైరుతి రుతుపవన వర్షమా..? లేదా..? అన్నది గురువారం తేలనుందని చెప్పారు.

కనీసం మూడు రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతంలో 60శాతం మేర కురిస్తే అది రుతుపవన వర్షపాతంగా భావించాల్సి ఉంటుందన్నారు. ఏదిఏమైనా ఈ నెల 27 వరకు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్న చల్లని కబురును ఆమె అందించారు. బుధవారం నుంచి గురువారం వరకు కరీంనగర్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో అక్కడక్కా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

చల్లబడిన వాతావరణం…
కాగా.. బుధవారం హైదరాబాద్‌ నగరంతోపాటు పలు జిల్లాల్లో మధ్యాహ్నం ఎండలు దంచికొట్టగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. వానాకాలంలోనూ 44 డిగ్రీల తీవ్రమైన ఎండలు, వడగాలులతో బడలిపోయిన రాష్ట్ర ప్రజలు బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణం ంతో ఉపశమనం పొందారు. వాతావరణం చల్లబడడంతో రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర చల్లబడ్డాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 41.7 డిగ్రీలు, భద్రాచలంలో 39.6, హన్మకొండలో 40.5 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38.8 డిగ్రీలు, ఖమ్మంలో 38.6 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 39.5 డిగ్రీలు, నల్గొండలో 41.5 డిగ్రీలు, నిజామాబాద్‌ 39.7 డిగ్రీలు, రామగుండంలో 42 డిగ్రీల మేర ఎండలు కాచాయి.

- Advertisement -

పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు…
గడిచిన 24గంట ల్లో బుధవారం హైదరాబాద్‌తోపాటు నల్గొండ, నాగర్‌కర్నూలు, మంచిర్యాల, కుమ్రంబీం ఆసీఫాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ వెల్లడించింది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెంలో 7.5 మి.మీలు, హన్మకొండలో 2.3, జయశంకర్‌ భూపాలపల్లిలో 2.2, జనగామలో 6.1, ఖమ్మంలో 3.6, కుమరంబీం ఆసీఫాబాద్‌లో 3.6, మహబూబాబాద్‌ 17 మి.మీ, మంచిర్యాలలో 0.1, ములుగులో 6.7 మి.మీలు, నాగర్‌కర్నూలులో 3.2, నల్గొండలో 7, రంగారెడ్డిలో 0.3, సూర్యాపేటలో 2.2, వరంగల్‌లో 7.7మి.మీలు, యాదాద్రి భువనగిరిలో 3.5 మి.మీలతో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 2.6 మి.మీల వర్షపాతం కురిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement