Saturday, May 4, 2024

ఏళ్ల కొద్దీ జైళ్లలో మగ్గుతున్న అండర్​ ట్రయల్స్.. దీనిపై ఫోకస్​ పెట్టాలన్న సీజేఐ ఎన్వీ రమణ

దేశంలోని 6.10 లక్షల మంది ఖైదీల్లో దాదాపు 80 శాతం మంది అండర్ ట్రయల్‌గా ఉన్నారని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ అన్నారు. నేర న్యాయ వ్యవస్థ (Criminal Justice) సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని శనివారం ఆయన నొక్కి చెప్పారు. నేర న్యాయ వ్యవస్థ ప్రక్రియ అనేది శిక్షించడంతోనే సరిపోదని.. విచక్షణా రహితంగా అరెస్టు చేయడం నుంచి బెయిల్ పొందడంలో ఇబ్బంది వరకు అన్ని రకాల పరిశీలన చేయాల్సి ఉంటుందన్నారు. అండర్ ట్రయల్ ఖైదీలను సుదీర్ఘంగా నిర్బంధించే ప్రక్రియపై తక్షణ శ్రద్ధపెట్టాల్సిన అవసరముందని చీఫ్​ జస్టిస్​ అభిప్రాయపడ్డారు. 

జైపూర్‌లో జరిగిన 18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రారంభ సెషన్‌లో సీజేఐ మాట్లాడుతూ.. క్రిమినల్ న్యాయ వ్యవస్థ యొక్క పరిపాలన సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎలాంటి విచారణ లేకుండానే పెద్ద సంఖ్యలో వ్యక్తులను సుదీర్ఘంగా జైలులో ఉంచడంపై దృష్టి సారించాలని జస్టిస్ రమణ అన్నారు. అయితే.. అండర్ ట్రయల్ ఖైదీలను ముందస్తుగా విడుదల చేయడమే లక్ష్యం పెట్టుకోవద్దని పేర్కొన్నారు. అలా కాకుండా, విచారణ లేకుండానే భారీ సంఖ్యలో ఎక్కువ కాలం జైలు శిక్ష విధించే విధానాలను ప్రశ్నించాలన్నారు సీజేఐ రమణ.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement