Sunday, May 5, 2024

కోకో దీవుల‌లో చైనా పాగా – భార‌త్ కి కొత్త టెన్ష‌న్..

న్యూఢిల్లి: భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన అండమాన్‌ దీవుల సమీపంలో డ్రాగన్‌ పాగా వేస్తోంది. ఇక్కడికి అత్యాధు నిక పరికరాలను చేరవేస్తోంది. ఈ దీవులకు అత్యంత సమీపంలోని మయన్మార్‌కు చెందిన కోకో దీవుల్లో సైనిక పరికరాల ఆధునికీకరణ జరుపుతోంది. ఉపగ్రహ చిత్రాల ద్వారా చైనా కుట్రలు వెల్లడయ్యా యి. కోకో దీవులను లైజనింగ్‌ పోస్ట్‌గా చైనా ఉపయోగిస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరిలో మాక్సర్‌ సంస్థ విడుదల చేసిన చిత్రాల్లో గ్రేట్‌ కోకో దీవిలో నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఉపగ్రహ చిత్ర నిపుణులు డామియన్‌ సైమన్‌, భద్రత, విదేశీ వ్యవహారాల నిపుణుడు జాన్‌ పొలాక్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించేలా రాసిన వ్యాసాలను లండన్‌లోని ఛాతమ్‌ హౌస్‌ ప్రచురించింది. రెండు హ్యాంగర్లు, కాజ్‌వే , నివాస సముదాయం, రాడార్‌ స్టేషన్‌, రన్‌వే నిర్మాణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మార్చిలో ఈ ద్వీపం దక్షిణభాగంలో నేలను సిద్ధంచేసే పనులు జరిగినట్లు స్పష్టమైంది. ఈ పరిణామాలను విశ్లేషిస్తే, చైనా ఈ ప్రాంతాన్ని తన భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధం చేస్తున్నదనే సందేహం బలపడుతోందని రక్షణరంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

హిందూ మహాసముద్రంలోనూ..

దక్షిణచైనా సముద్రంతోపాటు, హిందూ మహా సముద్రంలోనూ ఆధిపత్యానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడి 33 కీలక ప్రదేశాలకు తరచూ సర్వే నౌకలను పంపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని నేషనల్‌ నేచురల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ చైనా అధికారికంగా వెల్లడించింది. వీటిలో ఆరు సర్వేపాయింట్లు పసిఫిక్‌ సముద్రంలోని అమెరికా స్థావరాలకు చేరువలో ఉన్నాయి. చైనాను కట్టడి చేయడానికి వీటిని అమెరికా ఏర్పాటు చేసుకుంది. చైనా సర్వే నౌకలు ప్రయాణిస్తున్న మార్గాల్లో, తైవాన్‌-ఫిలిప్పీన్స్‌ మధ్యలోని లోతైన ప్రదేశం కూడా ఉంది. ఇది జలాంతర్గాముల ప్రయాణానికి అత్యంత కీలకమైనమార్గం. కాగా, గత కొన్నేళ్లుగా భారత్‌ బంగాళాఖాతంలో పలు క్షిపణులను పరీక్షిస్తోంది. తాజాగా చైనా ప్రకటించిన సర్వే పాయింట్లు, క్షిపణి పరీక్షల రేంజిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడి నుంచి భారత్‌ చేపట్టే పరీక్షలను డ్రాగన్‌ విశ్లేషించే అవకాశం ఉండటం ప్రమాదకరంగా మారింది. గతేడాది డిసెంబర్‌లో ఒడిశాలోని అబ్దుల్‌ కలామ్‌ ద్వీపం నుంచి 5000 కి.మీ. రేంజి అగ్ని-5 పరీక్షను నిర్వహించే నోటమ్‌ జారీ చేసిన సమయంలో, చైనా సర్వేనౌక యువాన్‌వాంగ్‌-5 హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించింది. శ్రీలంకలోని హంబన్‌టోట రేవు వద్ద తిష్టవేసింది. అంతకు ముందు అగ్ని-3 పరీక్ష సమయంలోనూ చైనా నౌక హిందూ మహాసముద్రంలో ఉన్నది. దీంతో ప్రయోగ పరీక్ష తేదీలను మార్చుకోవాల్సి వచ్చింది. ప్రపంచంలో మరెవ్వరి వద్దాలేనన్ని (60) సర్వే నౌకలు చైనావద్ద ఉన్నాయి. ఈ నౌకల కార్యకలాపాలపై స్పష్టతలేదు. పేరుకి సర్వే నౌకలుగా చెబుతున్నప్పటికీ, నిఘా పనులు కూడా చేసే సామర్థ్యం వీటికుంది. దాంతో చైనా కుట్రలు ఎప్పుడు? ఎలా? ఉంటాయో గమనించడం కష్టతరం అవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement