Monday, April 29, 2024

తెలంగాణలో మారిన వ్యాపార స్వరూపం.. డిజిటల్‌ వైపు కంపెనీల దృష్టి..

తొలిసారి 2020 సంవత్సరంలో కొవిడ్‌ సంక్షోభం తలెత్తిన తర్వాత కార్యాలయాలను పూర్తిగా మూసివేసి ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఐటీ రంగం ఆ తర్వాత కొద్ది రోజులకే కోలుకోవడమే కాక వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతిలో విజయ వంతంగా పనిచేయించగలిగిన కంపెనీలు కొవిడ్‌ విసిరిన సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాయి. కొవిడ్‌తో మారిన పరిస్థితులతో అన్ని రంగాల్లో వెల్లువెత్తిన డిజిటల్‌ విప్లవంతో ఐటీ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలు, మార్కెట్‌ లభించాయి. ఈ కారణంగా గడిచిన ఏడాది ఐటీ కంపెనీలు 20 శాతానికిపైగా ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. దీంతో కంపెనీలు ఇదే స్థాయిలో ఉద్యోగాల కల్పనకు ముందుకువచ్చాయి. ఎప్పుడూ లేనంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. పలు కొత్త పాలసీలతో తెలంగాణలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తుండడంతో రానున్న రోజుల్లో తెలంగాణలో సంవత్సరానికి కొత్తగా వచ్చే ఐటీ ఉద్యోగాల సంఖ్య ప్రస్తుతమున్న 30 వేల నుంచి ఏకంగా 50 వేలకు చేరుకుంటుందని హైసియా, నాస్కామ్‌ వంటి ఐటీ కంపెనీల అసోసియేషన్‌లు చెబుతున్నాయి.

రాష్ట్రంలో ఐటీతో పాటు రియల్‌ ఎస్టేట్‌లో కూడా వృద్ధి పరుగులు పెట్టనుందని ఇటీవల క్రెడాయ్‌ ఒక అధ్యయనంలో తెలిపింది. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యు లేటరీ అథారిటీ (రెరా) ఏర్పడిన తర్వాత తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు రియల్‌ ఎస్టేట్‌లోకి వచ్చాయని పేర్కొంది. ఐటీ రంగంలో వేగవంతమైన వృద్ధి వల్లే రియల్‌ ఎస్టేట్‌లోకి ఈ తరహాలో భారీ పెట్టుబడులు సాధ్యమయ్యాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఐటీ, ఫార్మా, వస్త్ర తయారీ పరిశ్రమ రంగాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని, ఈ క్రమంలోనే ప్రతి రంగంలోనూ సరికొత్త పాలసీలు ప్రవేశ పెడుతూ రాష్ట్రం దూసుకుపోతోందని తెలిపింది. జీఎస్‌డీపీ పరంగా దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏడో అతి పెద్ద రాష్ట్రమని నీతిఆయోగ్‌ ఇటీవల వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అగ్రగాములుగా ఉన్న ఐటీ కంపెనీలైన గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఐబీఎం తదితర కంపెనీలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి కార్యాలయాలు ప్రారంభించడమే రానున్న రోజుల్లో తెలంగాణలో ఐటీ వృద్ధి వేగంగా కొనసాగుందనడానికి నిదర్శనమని పలువురు ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం స్థిరమైన వృద్ధి రేటు కనబరుస్తోందని నీతిఆయోగ్‌ ఇటీవల వెల్లడించిన అర్ధ్‌నీతితో పాటు ఇతర సంస్థల నివేదికలు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement