Monday, May 27, 2024

Breaking: కేంద్రం సవతి తల్లి ప్రేమ.. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలే: మహా సీఎం ఉద్ధవ్​

పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపుపై కేంద్రంపై మండిపడ్డారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే..  కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడ్డం లేదని, బీజేపీయేతర రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తోందని గట్టిగానే అటాక్​ చేశారు. ఇవ్వాల (బుధవారం) మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఇంధనంపై పన్ను తగ్గించాలని బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ట్రాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేసిన తర్వాత, ఉద్ధవ్ ఎదురుదాడికి దిగారు. ఇంధన ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వహించవని అన్నారు.

ఈరోజు ముంబైలో లీటర్ డీజిల్ ధరలో కేంద్రానికి రూ.24.38, రాష్ట్రానికి రూ.22.37. పెట్రోల్ ధరలో 31.58 పైసలు కేంద్ర పన్ను, 32.55 పైసలు రాష్ట్ర పన్నుగా వెళ్తున్నట్టు తెలిపారు. అందువల్ల రాష్ట్రం కారణంగా పెట్రోల్, డీజిల్ ధర పెరగడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.  కాగా, మహారాష్ట్ర దేశంలోనే అత్యధికంగా 15 శాతం జీఎస్‌టీని వసూలు చేస్తుంది. ప్రత్యక్ష పన్నులు, GST రెండింటినీ కలిపి మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.

భారతదేశంలో కొవిడ్ -19 పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో చివరగా ప్రధాని మోడీ ఇంధన ధరల పెరుగుదల అంశంపై మాట్లాడారు. అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయని, సామాన్యులకు ప్రయోజనం చేకూర్చేందుకు “జాతీయ ప్రయోజనాల” దృష్ట్యా విలువ ఆధారిత పన్నును తగ్గించాలని కోరారు.  “నేను ఎవరినీ విమర్శించడం లేదు, కానీ మీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను… ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ఆరు నెలల ఆలస్యం తర్వాత అయినా ఇప్పుడు వ్యాట్‌ని తగ్గించాలని మిమ్మల్ని కోరుతున్నాను” అని మోడీ అన్నారు.

అయితే.. ఇంధనంపై వ్యాట్ తగ్గింపు విషయంలో రేపు  (గురువారం) జరిగే మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించే చాన్స్​ ఉంది. కాగా, తమ ప్రభుత్వం ఇప్పటికే పౌరులకు సహజ వాయువుపై పన్ను మినహాయింపు ఇచ్చిందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. సహజవాయువు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ను 13.5 శాతం నుంచి 3 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. పైప్డ్ గ్యాస్ హోల్డర్లు, ప్రజా రవాణా లాభపడ్డాయని ఆయన తెలిపారు. కేంద్రం రాష్ట్రాలకు సవతి తల్లిలా వ్యవహరిస్తోందని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడడం లేదని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement