Saturday, May 4, 2024

కేంద్రం సుంకాల మోత – రాష్ట్రాల‌కు నిధుల కోత‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వ సుంకాల వసూళ్ల పర్వం నాలుగింతలకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వాలను వేధింపులకు గురిచేస్తూ కేంద్ర ఖజానాను నింపుకునే ప్రణాళికలు మరింత పదునెక్క గా, ఆ దిశగా సఫలమవుతున్న కేంద్ర చర్యలతో 2014నుంచి 2022కు చేరేసరికి సెస్సుల ఆదాయం రెండింతలకు చేరుకున్నది. సెస్సుల వసూళ్లు 2013-14లో రూ. 73,8890 కోట్లుకాగా, 2021-22 లో 3,18,000కోట్లకు చేరింది. పెట్రోల్‌పై సెస్సులు 2013-14లో రూ. 4712కోట్లుకాగా, 2021-22లో 30వేల కోట్లకు పెరిగింది. డీజిల్‌పై 2013-14లో రూ. 15765కోట్లు సెస్సుల రూపంలో వసూలుకాగా, 2021-22లో రూ. 95వేల కోట్లకు చేరుకున్నది. ఆర్ధికంగా రాష్ట్రాలను అస్థిరపర్చే కుట్రలో భాగమే ఇదని ఆర్ధిక వేత్తలు అంటుండగా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కేంద్రం తన ఖజానాను నింపుకోవడం చూస్తే వాస్తవమేనని అంటున్నారు. సెస్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వ వసూళ్ల బాదుడు ఏకంగా 4రెట్లకు పైగా పెరుగుదల సొంతం చేసుకు న్నది. 2013-14తో పోలిస్తే 2021-22లో సెస్సుల పెరుగుదల 18శాతానికి పైగా పెరిగింది. గడచిన తొమ్మిదేళ్లలో పెట్రో, డీజిల్‌పై కేంద్రం పన్నులను విపరీతంగా పెంచింది. పెట్రోల్‌పై పన్ను రెండునుంచి మూడు రెట్లు, డీజిల్‌పై ఐదునుంచి పది రెట్లు పెంచింది. 2014లో పెట్రోల్‌పై లీటర్‌పై రూ. 9.48ఉండగా, 2022లో రూ. 32.98కి, డీజిల్‌పై లీటర్‌పై 2014లో రూ. 3.56ఉండగా, 2022లో రూ. 31.83కు పెంపుదల వర్తింపజేశారు.


రోజుకు రూ. 813కోట్లు…

ఇలా కేంద్రం సెస్సుల పేరుతో రోజుకు సగటున రూ. 813కోట్లు ఖజానాలో వేసుకుంటోంది. 2014 ఆర్ధిక ఏడాదికి రూ. 22,236కోట్లుగా ఉన్న ప్రైమరీ ఎడ్యుకేషన్‌ సెస్సును రూ. 62వేల కోట్లకు, సెకండరీ, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ సెస్సును రూ. 11,266కోట్లనుంచి రూ. 35,821కోట్లకు పెంచింది. డీజిల్‌పై రూ. 15,765కోట్లనుంచి రూ. 85,289కోట్ల
కు పెంచి గత ఆర్ధిక ఏడాదిలో రూ. 3లక్షల కోట్లకుపైగా వెనకేసుకొని రాష్ట్రాలకు మొండి చేయి చూపింది.
ఇదిలా ఉండగా, సెస్సుల పేరుతో దోపిడీని కొనసాగిస్తూనే, 15వ ఆర్ధిక సంఘం నిధుల్లో వాటా తగ్గిస్తూనే గత హామీలను విస్మరించింది. దక్షిణాది రాష్ట్రాలకు పన్నుల వాటా పెంచాలని, తెలంగాణ వంటి ఆర్ధిక పురోభివృద్ధిలో ఉండి కేంద్రానికి ఆదాయ న్నందిస్తున్న రాష్ట్రంపై ఆంక్షలు తొలగించాలన్న తెలంగాణ విజ్ఞపిని బుట్టదాఖలు చేసింది. జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీఎస్టీ పన్నుపై పున:సమీక్ష చేయాలని డిమాండ్‌ను కేంద్రం ఎప్పిటినుంచో పెండింగ్‌లో పెట్టింది. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని కూడా తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి చెబుతూ వస్తోంది.

అదేవిధంగా వ్యవసాయరంగానికి ప్రతిబంధకా లుగా ఉన్న పలు అంశాలపై నియంత్రణలు, పన్నులను ఎత్తివేసి మినహాయింపులను తెలంగాణ కోరుతోంది. నీతి ఆయోగ్‌ సిఫార్సులను అమలు చేసి తెలంగాణకు ఆర్ధిక సాయం అందించాలని, కాళేశ్వరా నికి జాతీయ హోదా వర్తింపజేయడంతోపాటు, బడ్జెట్‌లో పన్నుల వాటా పెంపుపై ఎంతోకాలంగా ఎదురుచూస్తోంది. రుణాలపై ఉన్న ఆంక్షలు, ఎఫ్‌ఆర్‌ బీఎం పరిమితి పెంపు, ప్రధానంగా కార్పొరేషన్ల రుణాలకు ఉన్న ఆటంకాల తొలగింపుపై ఇప్పటి వరకూ ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. జీఎస్‌డీపీ పరిమితికిలోబడి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల ను పెంచాలని, షరతులను తొలగించాలని పదేపదే చేసిన విజ్ఞప్తిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన రూ. 817కోట్ల పెండింగ్‌ నిధుల విడుదల, పట్టణ, స్థానిక సంస్థలకు నిధుల సాయం పెంపు, 2021-22లో 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన స్థానిక సంస్థల నిధులు రూ. 1013కోట్లు బకాయిలు, వెనుకబడిన జిల్లాలకు రూ. 450కోట్లు చెల్లించలేదని తెలంగాణ పేర్కొంటోంది. ఈ విషయం లో రూ. 1350కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి.

ప్రజా సంక్షేమంలో ప్రగతి పథం…
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలులో లేవు. .అణగారిన, నిమ్న వర్గాలు, అన్ని నిరుపేద వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నిధుల్లో వాటా పెంచుతూ సంక్షేమ పథకాలతో ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పాటునందిస్తోంది. సకల వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సరికొత్త పథకాలను అమలు చేస్తూ ఎనిమిదేళ్ల పాలనలో ఉత్తమ లక్ష్యాలను చేరుకున్నది. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో కేటాయింపుల శాతం మూడింత లకు పెరిగింది. 2014-15 తొలి ఏడాదిలో సంక్షేమ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్‌లో రూ. 24,424కోట్లు కేటాయించగా, గతేడాది నాటికి రూ. 98,425 కోట్లకు చేరుకున్నది. 2015-16లో రూ. 42,510కోట్లు, 2016-17 ఏడాదిలో రూ. 47,949కోట్లు, 2017-18లో రూ. 50,204కోట్లు, 2018-19లో రూ. 56,887కోట్లు, 2019-20లో రూ. 57,910కోట్లు, 2020-21లో రూ. 70,078కోట్లు, 2021-22 ఏడాదిలో రూ. 98,425కోట్లను కేటాయించి తన ఔదార్యాన్ని చాటుకున్నది. తాజాగా యాసంగి రైతుబంధు పూర్తిచేసిన ప్రభుత్వం, ఇక ప్రతీ నియోజకవర్గానికి 1500మందికి దళితబంధుపై నిధుల సమీకరణ వేగం పెంచింది. సొంత స్థలం ఉన్న పేదలకు సొంతింటికి రూ. 3లక్షల అందజేతకు కూడా కార్యాచరణ జరుగుతోంది. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో సహజంగానే మరికొన్ని కొత్త పథకాలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడున్న పథకాల ఖర్చు, సబ్సిడీలు, జీతాలు, పింఛన్లు, ఉద్యోగులకు ఇతర వరాలు, పాత పెన్షన్‌ విధానం వంటి పలు అంశాలపై ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement