Sunday, May 19, 2024

భారతీయ కంపెనీ మరో ఘనత.. రక్త పరీక్షతో క్యాన్సర్ నిర్ధారణ

కేవలం రక్త పరీక్షతో క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించే ప్రక్రియను భారతీయ కంపెనీ రూపొందించింది. ముంబైకు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ ఎపిజనరిస్ కంపెనీ సింగపూర్ లోని జార్ ల్యాబ్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ ప్రక్రియను అభివృద్ధి చేసింది. రెండు కంపెనీలు నానోటెక్ సైంటిస్టు వినయ్ కుమార్ త్రిపాఠి, ఆయన కుటుంబ సభ్యుల యాజమాన్యంలోనివే కావడం విశేషం. ఈ ప్రక్రియపై బెర్లిన్ నుంచి వెలువడే మెడికల్ జర్నల్ సానుకూల సమీక్ష ప్రచురించింది. ఈ ప్రక్రియ వందశాతం రుజువైందని పేర్కొన్నది.

రెండు కంపెనీల నిర్వహణలో పాలుపంచుకుంటున్న త్రిపాఠీ ఇద్దరు కుమారులు ఆశిష్, అనీష్ మీడియాకు ఈ ప్రక్రియ గురించి వివరించారు. ఈ ప్రక్రియకు హెచ్ఆర్‌సీ అని పేరు పెట్టారు. వెయ్యిమందిపై జరిపిన పరీక్షల్లో 25 రకాల క్యాన్సర్లు గుర్తించడం జరిగిందని వారు వివరించారు. ముందుగా భారత్‌లో ఈ ప్రక్రియను ప్రారంభించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరలో ఈ తరహా క్యాన్సర్ పరీక్షలను ప్రవేశపెడతామని వివరించారు. రక్తాన్ని సేకరించి మాలిక్యులర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా క్యాన్సర్ ను పసిగట్టడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. లక్షణాలు బయటపడేందుకు చాలా ముందరే క్యాన్సర్ ఉనికి తెలుస్తుంది. ప్రస్తుతం ఫలితాలు రావడానికి 3-4 రోజులు పడుతున్నది. ఆటోమేషన్‌తో ఈ సమయాన్ని 2 రోజులకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత క్యాన్సర్ పరీక్షలు చాలా బాధాకరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రక్రియలో కేవలం 5 మిల్లీ లీటర్ల రక్తం తీసుకుంటే చాలు. పరీక్ష అయిపోయినట్టేనని అనిశ్ త్రిపాఠీ అన్నారు. కనీస స్థాయిలోనే దీని ధర నిర్ణయిస్తామని వారు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement