Friday, May 3, 2024

ద‌స‌రా రోజున బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయికి విస్తరించిన బీఆర్‌ఎస్‌… ఇప్పుడు ఎన్నికల ప్రణాళికపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఈ అంశాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణాలో పెద్ద పండగ దసరా రోజున బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల చేయాలన్న సెంటిమెంట్‌తో కసరత్తు వేగవంతం చేశారు. జాతీయ అజెండాతో ఒక మేనిఫెస్టో, రాష్ట్రం కోసం మరో మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తెలంగాణ మినహా పోటీ చేయాలనుకుంటున్న అన్ని రాష్ట్రాలకు నేషనల్‌ మేనిఫెస్టో వర్తించేలా నిపుణులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యాభై మందికి పైబడిన నిపుణుల బృందం ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేస్తోంది. కొత్త ఓటర్లను ఆకర్షించడంపై స్పెషల్‌ ఫోకస్‌ పెడుతున్నట్లు సమాచారం.

ఏప్రిల్‌ 27న తెలంగాణ భవన్‌లో జరుగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అజెండాలో ఎన్నికల ప్రణాళిక రూపకల్పన అంశమే అత్యంత కీలకమైనదని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేడర్‌కు అధినేత కేసీఆర్‌ మార్గనిర్దేశం చేయనున్నారు. ఏ జిల్లాలో పరిస్థితులు ఎలాగున్నాయి.. ఎక్కడెక్కడ మేల్కొనాల్సిన అవశ్యకత ఉందన్న కోణంలో పూర్తిస్థాయి సమాచారంతో సంసిద్ధమైన సీఎం తనదైన శైలిలో దశ, దిశ చూపనున్నారు. అదే క్రమంలో గత కొంత కాలంగా ప్రజల్లో చులకనభావం పెరిగిన ఎమ్మెల్యేలు, పదేపదే చెప్పినా పనితీరు ఏమాత్రం మెరుగుపడని ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్‌ ఇవ్వనున్నారు. నియోజకవర్గాల్లో జరిగిన సర్వే అంశాలను ప్రస్తావిస్తూ పార్టీ బలోపేతానికి మార్గదర్శకాలు, ప్రజలతో మమేకమయ్యేందుకు వ్యూహాలతో అధినేత అందేశం ఇవ్వనున్నారు.

2014, 2018 అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్టీ అభివృద్ధి, విజయాలపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో పాటు పార్టీ అధిష్టాన నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి 100 అసెంబ్లీ స్థానాలు గెలిచి, హ్యాట్రిక్‌ విజయం సాధించడం అనేది ప్రధాన లక్ష్యంగా జరగనున్న ఈ ప్లీనరీలో అనేక అంశాలు చర్చించనున్నారు. అదనంగా పార్టీ నాయకత్వం ప్లీనరీకి ముందే ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలపై అధ్యయనం చేస్తోంది. పని చేయని శాసనసభ్యులకు వారి మార్గం మార్చడానికి చివరి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ యోచిస్తున్న తరుణంలో అక్టోబర్‌లోగా పనితీరు మెరుగుపడకుంటే పార్టీ ప్రత్యామ్నాయ అభ్యర్థుల కోసం చూడాల్సి వస్తుందని బీఆర్‌ఎస్‌ నాయకత్వం స్పష్టమైన సందేశం పంపుతుందని పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు కవర్‌ చేయని ఇతర వర్గాల ఓటర్లపై దృష్టి సారించే బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించనున్నారు.

మార్చి మూడవ వారం నుండి అన్ని గ్రామాలు, మండలాలను కవర్‌ చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించిన నేపథ్యంలో సాధించిన ఫలితాలను ఒక్కొక్కరుగా వివరించాలని సీఎం ఆదేశించనున్నారు. మే చివరి వరకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు కొనసారించాలని, ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగాలని మార్గనిర్ధేశం చేయనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ నుండి ఏమి ఆశిస్తున్నారనే దానిపై ఈ సమ్మేళనాలలో స్థానికులు, కార్మికుల నుండి అభిప్రాయాన్ని పొందాలని సూచించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించేటప్పుడు పార్టీ ఈ ఫీడ్‌బ్యాక్‌ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటు-ంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement