Monday, April 29, 2024

బిఆర్ఎస్ విస్త‌ర‌ణ – పొరుగు రాష్ట్రాల‌పై దృష్టి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: జాతీయ స్థాయిలో పార్టీని గ్రామ స్థాయి వరకు విస్తరించేందుకు భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. రాష్ట్రంతో పాటు- వివిధ రాష్ట్రాల్లో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగి సత్తా చాటేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు- సమాచారం. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, సంఘాలు, తమతో కలిసి వచ్చే ప్రతి వారిని అక్కున చేర్చుకుని ఎన్నికల గోదాలో దిగాలన్న నిర్ణయానికి గులాబీ బాస్‌ వచ్చినట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రజల కోసం, వారి అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేస్తున్న సంస్థలు, వ్యక్తులను ఇప్పటికే గుర్తించిన గులాబీ దళపతి వారితో వరుస సమాలోచనలు జరుపుతున్నట్టు- ప్రచారం జరుగుతోంది. ఆయా ప్రాంతాలలో స్థానికంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తున్న కేసీఆర్‌ భావసారూప్యత ఉన్న పార్టీలతో చర్చించి వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు- చేసుకోవాలని భావిస్తున్నట్టు- సమాచారం. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే భారాస ఆవిర్భావానికి సంబంధించిన కార్యక్రమాలకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ నెల 6న భారీ బహిరంగ సభను నిర్వహించి భారాసను ఎందుకు ఏర్పాటు- చేయవలసి వచ్చింది.. పార్టీ మూల సిద్ధాంతాలను ఆ రాష్ట్ర ప్రజలకు వివరించారు. ఈ బహిరంగ సభకు కొనసాగింపుగా భారాస ఎమ్మెల్సీ, కేసీఆర్‌ తనయ కవిత రెండు రోజుల క్రితం ముంబై వెళ్లి అక్కడ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. మహారాష్ట్ర అభివృద్ధిలో భారాస కీలక భాగస్వామి అవుతుందని ఆమె చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం తాము పనిచేస్తామని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.

నాందేడ్‌ తరహాలోనే తెలుగువారు ఎక్కువగా ఉండే లాతూర్‌, సోలాపూర్‌, పుణ, ముంబై ప్రాంతాలలోనూ సభలు ఏర్పాటు- చేసేందుకు భారాస సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల నాయకులతో కేసీఆర్‌ చర్చించినట్టు- సమాచారం. వీలైనంత త్వరగా తేదీలను ఖరారు చేసి సభలు జరపాలన్న పట్టు-దలతో కేసీఆర్‌ ఉన్నట్టు- చెబుతున్నారు. మహారాష్ట్ర భారాస కిసాన్‌ సెల్‌(రైతు విభాగానికి) మాణిక్‌ కదమ్‌ను అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్‌… మిగిలిన పార్టీ అనుబంధ సంఘాలను ఏర్పాటు- చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు- పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కమిటీ-ల నియామకానికి మహారాష్ట్ర ముఖ్య నేతలతో కేసీఆర్‌ విడతల వారీగా చర్చలు జరుపుతున్నట్టు- తెలుస్తోంది. మహారాష్ట్ర స్టేట్‌ కమిటీ-ని కూడా త్వరితగతిన ఏర్పాటు- చేసి పార్టీ విస్తరణకు ముందుకు సాగాలని ఆయన నిర్ణయించినట్టు- సమాచారం. ఆదిలాబాద్‌ జిల్లా పొరుగున ఉన్న చంద్రపూర్‌, నాగపూర్‌, యవాత్మల్‌, వని, గుగ్గుస్‌, పర్భానీ, అమరావతి తదితర ప్రాంతాలలో పార్టీ విస్తరణ, బలోపేతం చేసే బాధ్యతను ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులకు అప్పగించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. నాందేడ్‌, నాసిక్‌, పుణ, సోలాపూర్‌ వంటి ప్రాంతాల బాధ్యత ఉమ్మడి నిజామాబాద్‌, మెదక్‌ జిల్లా భారాస నేతలకు కట్టబెట్టనున్నట్టు- చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన జిల్లాల నుంచి ఉపాధి నిమిత్తం ముంబై, పుణ, సోలాపూర్‌ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఊళ్లకు ఊళ్లే మహారాష్ట్రలో స్థిరపడి చిన్నపాటి పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని, అటు-వంటి వారిని గుర్తించి వారిని పార్టీలో కీలకం చేసేందుకు కేసీఆర్‌ ప్రతిపాదించినట్టు- ప్రచారం జరుగుతోంది. నలబై, యాభై ఏళ్ళ క్రితం పొట్టచేత పట్టుకుని ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, వరంగల్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ముంబైతో పాటు- ఇతర ప్రాతాలకు వెళ్లి స్థిరపడ్డారు. వారి చిరునామాలను ఇప్పటికే సేకరించిన భారాస వర్గాలు నేరుగా వారి దగ్గరకు వెళ్లి కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు- సమాచారం. ఈ బాధ్యతలను ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు అప్పగించే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు- సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement