Sunday, April 28, 2024

కొత్త మోడల్ ఫోన్‌లకు ఛార్జర్లు ఇవ్వలేదని జరిమానా

ఈ-వేస్టింగ్ నివార‌ణ‌, వాతావ‌ర‌ణం కాలుష్యం త‌గ్గింపు వంటి సాకుల‌తో ఇటీవల పలు కంపెనీలు కొత్త మొడ‌ల్ ఫోన్ల‌కు ఛార్జ‌ర్లు ఇవ్వ‌డం మానేశాయి. ఛార్జ‌ర్ కావాలంటే విడిగా కొనుక్కోవాలంటూ వినియోగ‌దారుల‌కు ఉచిత స‌ల‌హా ఇస్తున్నాయి. ఛార్జర్ లేకుండా ఫోన్ విక్ర‌యిస్తున్నందుకు అటు ధరలను కూడా కంపెనీలు తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌స్కా కొడుతున్న ప్ర‌ముఖ మొబైల్ బ్రాండ్ ఐఫోన్‌కు బ్రెజిల్‌లో ఎదురుదెబ్బ త‌గిలింది.

బ్రెజిల్‌కు చెందిన కన్జూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేటరీ.. ఛార్జ‌ర్ లేకుండా ఐఫోన్ సంస్థ‌ మొబైల్ విక్ర‌యించడాన్ని తీవ్రంగా ప‌రి‌గ‌ణించింది. వినియోగ‌దారుల‌కు మోసం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఐఫోన్‌కు సుమారు రూ.15 కోట్ల (2 మిలియన్‌ డాలర్లు) జరిమానా విధించింది. క‌స్ట‌మ‌ర్ల‌ను తప్పుదోవ పట్టించి ఛార్జర్‌ లేని మొబైల్‌ను విక్రయిస్తున్నందుకు ఈ జరిమానా విధిస్తున్నట్లు స్ప‌ష్టం చేసింది.

వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని త‌గ్గించే ఉద్దేశంతో ఐఫోన్ 12 సిరీస్‌ మొబైళ్లకు పవర్‌ అడాప్టర్ లేకుండా ఛార్జింగ్ కేబుల్‌ మాత్రమే ఇస్తామ‌ని గ‌త అక్టోబ‌ర్‌లో ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో బ్రెజిల్‌లో క‌స్ట‌మ‌ర్లు… వినియోగ‌దారుల ఫోరాన్ని ఆశ్ర‌యించ‌గా.. ఐఫోన్‌ను వివ‌ర‌ణ అడిగింది ఆ సంస్థ‌. అయితే వారు ఇచ్చిన స‌మాధానం సంతృప్తిక‌రంగా, స‌హేతుకంగా లేక‌పోవ‌డంతో రూ.15 కోట్లు ఫైన్ విదించింది. బ్రెజిల్ క‌న్జూమ‌ర్ కోర్టు ఇచ్చిన తీర్పు త్వ‌ర‌లోనే ఇత‌ర దేశాల్లోనూ రిపీట్ అవుతుందేమో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement