Friday, May 10, 2024

ప్ర‌భుత్వ భూముల‌కు క‌న్నం..”భూ”తాలు..

ఫర్నీచర్‌ పార్క్‌ పరిహారంపై కన్ను
మేనకూరు సెజ్‌కు సమీపంలో ఫర్నీచర్‌ పార్క్‌ ఏర్పాటు
కర్రగొల్లవోలు, మనవాలి గ్రామాల్లో వెయ్యి ఎకరాల సేకరణ
ప్రభుత్వ భూములను రాత్రికి రాత్రే దున్నేస్తున్న అక్రమార్కులు
మొక్కుబడి సాగుతో హక్కుదారుడిగా అవతారం
మాఫియాకు కొందరు రెవెన్యూ అధికారుల సహకారం
ఇప్పటికే 250 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఆక్రమణ
నెల్లూరు జిల్లాలో భారీ భూ దోపిడీకి… పక్కా పథకం

అమరావతి, : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మేనకూరు సెజ్‌ సమీపంలో ఫర్నీచర్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన భూములను కూడా సేకరించింది. ఓజిలి మండలం కర్రగొల్లవోలు, మనవాలి రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 1000 ఎకరాల ను ఫర్నీచర్‌ పరిశ్రమకు అప్పగించాలని, ఆ దిశగా అవసరమైన ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు శరవేగంగా చేపడుతు న్నారు. అయితే ఫర్నీచర్‌ పార్క్‌ కోసం సేకరిస్తున్న భూముల్లో అత్యధిక శాతం ప్రభుత్వ భూములు ఉండడం, అప్పటికే మేనకూరు సెజ్‌ రాకతో ఆ ప్రాంతంలో భూముల ధరలకు అమాంతంగా రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఫర్నీచర్‌ పరిశ్రమ కోసం తీసుకుంటున్న భూములకు పరిహార ధరను ఇంకా నిర్ణయించకపోయి నప్పటికీ భారీగా పరిహారం ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది కబ్జాదా రులు ఏకంగా ప్రభుత్వ భూములను ఆక్రమించేసుకుని రాత్రికి రాత్రే సాగు చేస్తున్నారు. అంతే వేగంగా ఆ భూములకు హక్కుదారుడిగా అవసరమైన పత్రాలను కూడా సృష్టి ంచేస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ భూములను సొంత భూములుగా చూపించి ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని బొక్కేయాలని కొంతమంది పెద్దలు పక్కా పథకాన్ని వేస్తున్నారు. దీంతో ఇప్పటికే 250 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తెరవెనుక గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దోపిడీకి కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా చేతులు కలిపినట్లు తెలుస్తోంది. స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాయుడుపేట, ఓజిలి మండలాలకు సమీపంలో సుమారు 5400 ఎకరాల్లో మేనకూరు సెజ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో సెజ్‌లు రాకముందు ఎకరా భూమి రూ. 2 లక్షలు కూడా ధర పలికేది కాదు. కొంతమంది రైతులైతే పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేయలేక వందలాది ఎకరాల భూములను బీడుగా వదిలేశారు. మరికొంత మందైతే చౌక, జామాయిల్‌ తోటలను సాగు చేసేవారు. అయితే మేనకూరు సెజ్‌ ఏర్పాటుతో ఈ ప్రాంతం పారిశ్రామి కంగా మంచి అభివృద్ది సాధించింది. దేశ విదేశాల నుంచి భారీ పరిశ్రమలు కొలువుదీరాయి. దీంతో ఎకరా భూమి రూ. 60 లక్షల వరకు వెళ్లింది.
ప్రభుత్వ భూములకు కన్నం
ఓజిలి మండల పరిధిలోని కర్రగొల్లవోలు, మనవాలి గ్రామాల పరిధిలో సుమారు 1000 ఎకరాలను సేకరిస్తున్నా రు. అందుకు సంబంధించి మనవాలి రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబరు 114 నుంచి 185 వరకు 606 ఎకరాలను సేకరించారు. వీటి పరిధిలో గ్రామ పోరంబోకు, వాగు పోరంబోకు, అసైన్డ్‌ భూములతో పాటు ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. వాటిలో 70 శాతం పైగా ప్రభు త్వ భూములే అధికంగా ఉన్నాయి. అలాగే కర్రగొల్లవోలు గ్రామ పరిధిలో సర్వే నెంబరు 213, 214, 317, 318, 319లలో సుమారు 325 ఎకరాలను సేకరించారు. ఈ సర్వే నెంబర్ల పరిధిలో కూడా అత్యధిక శాతం ప్రభుత్వ భూములే ఉన్నాయి. మొత్తం మీద రెవెన్యూ అధికారులు సేకరిస్తున్న భూముల్లో 700 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములే ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని కొంతమంది భూబకాసు రులతో పాటు వెంకటగిరికి చెందిన మరికొంతమంది చేతులు కలిపి ప్రభుత్వ భూములను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ తరహాలో 250 ఎకరాలకు పైగా భూకబ్జాదారుల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 250 ఎకరాలకు పైగా
ప్రభుత్వ భూమి ఆక్రమణ
ఓజిలి మండల పరిధిలోని కర్రగొల్లవోలు, మనవాలి రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫర్నీచర్‌ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి భూముల సేకరణ జరుగుతోంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు అందుకు అవసరమైన చర్యలను చేపట్టారు. అయితే విషయం తెలుసుకున్న కొంతమంది భూబకాసురులు ప్రభుత్వ భూములను ఆక్రమించేసి ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని బొక్కేయడానికి పక్కా పథకం వేశారు. వెంకటగిరికి చెందిన ఓ పోలీసు కానిస్టే బుల్‌ ఈ ప్రాంతంలో 7 ఎకరాలకు పైగా రాత్రికి రాత్రే దున్ని పొలం సాగు చేస్తున్నట్లుగా రెవెన్యూ అధికారులతో పత్రాలు సృష్టి ంచారు. అలాగే ఇటీవల గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కొంతమంది 100 ఎకరాలకు పైగా భూములను కొనుగోలు చేశారు. అయితే అవి అసైన్డ్‌ భూములని తెలిసి తాము మోసపోయామని గ్రహించారు. భూములు అమ్మిన వారిని తమ సొమ్ము తిరిగివ్వాలని నిలదీస్తున్నారు. ఇవి కేవలం ఉదాహరణ మాత్రమే.. ఈ తరహా అక్రమాలు పై రెండు గ్రామాల పరిధిలో చాలా జరిగాయి. ఇప్పటివరకు సుమారు 250 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని సొంత భూమిగా మార్చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ పరిహారాన్ని దోచుకునేందుకు..
అడ్డదారులు తొక్కుతున్న భూబకాసురులు
ఫర్నీచర్‌ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి అధికారులు సేకరించిన భూములకు భారీగా పరిహారం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న భూముల ధరల ఆధారంగా ప్రభుత్వం ఎకరాకు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పరిహారాన్ని అందించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీంతో కొంతమంది భూబకాసురులు ఆ పరిహారాన్ని దొడ్డిదారిన సొంతం చేసుకునేందుకు ప్రభుత్వ భూములను సొంత భూములుగా మార్చేసుకుంటున్నారు. అందుకు కొంతమంది రెవెన్యూ అధికారులు వారికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. స్థానికంగా ఉండే కొంతమంది నాయకులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారితో చేతులు కలిపి ఏకంగా ప్రభుత్వ భూములనే సొంత భూములుగా చిత్రీకరించే ప్రయత్నాలను వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఫర్నీచర్‌ పార్క్‌ కోసం సేకరిస్తున్న భూములు, అందుకు సంబంధించి రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement