Tuesday, May 14, 2024

జైళ్ల డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ హేమంత్ లోహియా – దారుణ హ‌త్య‌

అతి దారుణంగా హ‌త్య చేయ‌బ‌డ్డారు జైళ్ల డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ హేమంత్ లోహియా..జ‌మ్మూలోని ఆయ‌న నివాసంలో దారుణ హ‌త్య‌కి గుర‌య్యారు.ఆయ‌న వ‌య‌సు 57ఏళ్లు. ఆయ‌న గొంతు కోసిన నిందితుడు ఆయ‌న మృత‌దేహానికి నిప్పు పెట్టేందుకు కూడా ప్ర‌య‌త్నించాడు. అయితే ఈ హత్యకు ‘పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్’ అనే ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించింది. కానీ ఇందులో ఉగ్ర శక్తుల ప్రమేయాన్ని పోలీసులు ఇప్పటి వరకు ప్రస్తావించలేదు. జమ్మూ శివార్లలోని ఉదయవాలా వద్ద ఉన్న జైళ్ల శాఖ డీజీ ఇంటిని సందర్శించిన జమ్మూ జోన్ అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ మాట్లాడుతూ.. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి లోహియా.. శరీరంపై కాలిన గాయాలు, గొంతు కోసిన గాయాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

హంతకుడు మొదట లోహియాను ఊపిరాడకుండా చేసి చంపాడని, అలాగే విరిగిన కెచప్ బాటిల్‌ని ఉపయోగించి అతని గొంతు కోసి, తర్వాత శరీరానికి నిప్పంటించే ప్రయత్నం చేశాడని పోలీసు చీఫ్ చెప్పారు. అయితే మృతుడి నివాసం వద్ద విధుల్లో ఉన్న గార్డులు లోహియా గ‌దిలో మంట‌లు రావ‌డాన్ని గ‌మ‌నించారు. ఇంట్లోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించ‌గా.. తాళం వేసి క‌నిపించింది. దీంతో గార్డులు త‌లుపులు ప‌గ‌లగొట్టి లోప‌లికి ప్ర‌వేశించారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలిస్తే ఇది క‌చ్చితంగా హ‌త్యే అని ఏడీజీపీ తెలిపారు. ఇంట్లో ప‌ని చేసే వ్య‌క్తి ప‌రారీలో ఉన్నాడ‌ని, అత‌డి కోసం అన్వేష‌ణ ప్రారంభ‌మైంద‌ని పేర్కొన్నారు. ఫోరెన్సిక్, క్రైమ్ బృందాలు ఆధారాలు సేక‌రిస్తున్నాయ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై విచారణ ప్రారంభ‌మైంద‌ని, సీనియ‌ర్ అధికారులు అంద‌రూ అక్క‌డే ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. జ‌మ్మూ కాశ్మీర్ పోలీసు కుటుంబం డీజీ మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తోంద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement