Thursday, April 25, 2024

Accidents: నెత్తురోడుతున్న రోడ్లు.. కామారెడ్డి జిల్లాలో 3 నెల‌ల్లోనే 63 మంది దుర్మ‌ర‌ణం

కామారెడ్డి, (ప్రభ న్యూస్) : జాతీయ రహదారులు హైదరాబాద్ నాగపూర్, కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి, సంగారెడ్డి నాందేడ్, కామారెడ్డి జిల్లా ప‌రిధిలో అధికంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. బయటకు వెళ్లిన వారు ఇంటికి క్షేమంగా వస్తారన్న ఆశలు గల్లంతు అవుతున్నాయి. గత ఏడాది ప‌లు ప్ర‌మాదాల్లో 259 మంది చనిపోగా.. ఈ సంవత్సరం 3 నెలల్లోనే ఇప్పటివరకు 63మంది రోడ్డు ప్ర‌మాదాల‌కు బ‌ల‌య్యారు. జాతీయ, రాష్ట్రచ‌ అంతర్గత రోడ్ల‌పై ప్రమాదాల్లో వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లాలో ప్రతి చోట ఏదో ఒక ప్రమాదం జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అతివేగం నిర్లక్ష్య డ్రైవింగ్ మత్తులో వాహనాలను నడపడం మైనర్లు వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణనం అవుతున్నాయి. లోపాలు నిరోధించాల్సిన ప్రభుత్వ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కామారెడ్డి జిల్లా నుండి హైదరాబాద్ నాగపూర్ ,సంగారెడ్డి నాందేడ్ ,కరీంనగర్ ఎల్లారెడ్డి జాతీయ రహదారులపై మితిమీరిన వేగంతో నిర్లక్ష్య డ్రైవింగ్ వాహనాలు నడుపుతున్నారు. అధికారుల నిర్లిప్తత, పనితీరు ప్రమాదాలకు ఒక కారణంగా చెబుతున్నారు. చిన్నచిన్న రూట్లలో ప్రతిరోజు వాహన తనిఖీలు చేపట్టే పోలీసులు జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులలో మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యం డ్రైవింగ్ వెళ్తున్న వాహనాలను కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శలు వస్తుతున్నాయి. ఇప్పటివరకు కామారెడ్డి లో 3 నెలల్లో 63 మంది ప్రాణాలు రోడ్డు ప్రమాదాలలో గాలిలో కలిశాయి. 52 రోడ్డు ప్రమాదాలు జరిగాయి 90 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. గత సంవత్సరం జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 260 మంది మృత్యువాత పడ్డారు. 165 మంది గాయాలపాలయ్యారు.

జాతీయ రహదారులపై రాష్ట్ర రహదారులపై పోలీసు నిఘా కరువైంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పలువురు చనిపోయారు. మూడు రోజుల క్రితం జాతీయ రహదారి పైన సదాశివ మండల కేంద్రంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రవీందర్ అనే వ్యక్తి చనిపోయాడు. మూడు నెలల క్రితం పొందుర్తిజాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి కూతురు మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో 72% ద్విచక్ర వాహనాల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రధాన కారణాలు అవుతున్నాయి మరి కొన్ని ప్రమాదాల్లో మద్యం నడపడం తో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్ ఎల్లారెడ్డి హైదరాబాద్ నాగపూర్ రోడ్లు పలుచోట్ల గుంతల మయం అయ్యాయి. పంచాయతీరాజ్ రోడ్లు ఆర్అండ్బి రోడ్డు పలు మండలాల్లో అధ్వాన్నంగా తయారై రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి కనీసం నిర్వహణ లేకపోవడం, నాసిరకం రోడ్డు నిర్మాణం పనులతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

పంచాయతీరాజ్ రోడ్లు వేసి నెలరోజుల్లోనే అధ్వానంగా తయారవుతున్నాయి గుంతల మయం రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్ల కక్కురుతి , అధికారుల ఇంజనీర్ల పర్సెంటేజ్ వ్యామోహంతో రోడ్లు గుంతల మయంఅయి పలుచోట్ల ప్రమాదాలకు కారణంగా ఉంటున్నాయని వాహనదారులు విమర్శిస్తున్నారు. మరికొన్ని రోడ్లు అసలు రిపేర్ లకి నోచుకోవడం లేదని వాపోతున్నారు.

కామారెడ్డి జిల్లాలో 44వ జాతీయ రహదారి 54 కిలోమీటర్ల ,161 జాతీయ రహదారి 57 కిలోమీటర్లు, హైదరాబాద్ మెదక్ రహదారి 71 కిలో మీటర్లు, కరీంనగర్ ఎల్లారెడ్డి 90 కిలోమీటర్లు రోడ్లు విస్తరించి ఉన్నాయి. ఇవి కాకుండా పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 571 కిలోమీటర్లు, ఇతర శాఖల ఆధ్వర్యంలో 636 కిలోమీటర్లు రహదారులు జిల్లాలో ఉన్నాయి. కామారెడ్డి కరీంనగర్ రోడ్డు లో క్యసంపల్లి మూలమలుపు రోడ్డు లో ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొంది. తాజాగా కామారెడ్డి సిరిసిల్ల రహదారిలోని మాచారెడ్డి మండలం ఘన్ పూరు మూలమలుపు వద్ద నిజామాబాద్కు చెందిన ఐకెపి సర్వేయర్ కృష్ణమూర్తి కుటుంబం సభ్యులు ఐదుగురు మృత్యు వాత పడ్డారు . ఘన్పూర్ మూలమలుపు రోడ్ అనేక ప్రమాదాలకు నిలయమైంది.

- Advertisement -

జాతీయ రహదారి నుండి దోమకొండ మీదుగా బీబీపేట చిన్న రహదారిలో నిత్యం వాహన తనిఖీలు నిర్వహించే పోలీసు సిబ్బందిని అధిక ప్రమాదాలు జరిగే రహదారులు, జాతీయ రహదారులో తనిఖీలు చేపడితే ప్రమాదాలు నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు. ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని వాహనదారులు సూచిస్తున్నారు. రహదారులపై మరింత నిఘా చర్యలు అవసరమని వాహనదారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement