Monday, May 20, 2024

బీజేపీ కొత్త రకం కుట్రలు.. తెలంగాణ‌పై అక్కసు వెళ్లగక్కిన మోడీ: టీఆర్‌ఎస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణపై ఉన్న ఈర్ష్యాద్వేషాలను రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదర్శించారని టీఆర్‌ఎస్ ఎంపీలు మండిపడ్డారు. మంగళవారం ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత, మాలోత్ కవిత ఢిల్లీలోని తెలంగాణా భవన్ కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అసత్య ప్రచారంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, నేతలకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వవచ్చని, ప్రధాని మోడీకి నోబెల్ బహుమతి ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. దేశాన్ని పాలించే ప్రధానమంత్రి రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడ్డం సిగ్గుచేటని వెంకటేష్ నేత ధ్వజమెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడిందని, ఆయన వ్యాఖ్యలను చూస్తే రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవముందో అర్థమవుతోందన్నారు.

తెలంగాణ ఏర్పాటు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్నట్టు మోదీ మాట్లాడారని, అసలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బిల్లులు చేసేది మీరేనని ఆరోపించారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీనైనా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని, నీటి వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వెంకటేష్ గుర్తు చేశారు. 2104లోనే సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసినా, అనేక విజ్ఞప్తులు చేసినా ఇప్పటి వరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందన్న వెంకటేష్ నేత… మిషన్ భగీరథ కోసం రూ 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా ఇప్పటివరకు నిధులివ్వకపోవడం వివక్ష కాదా అని నిలదీశారు. జీఎస్టీ పరిహారం బకాయిలు ఇవ్వడం లేదు, ITIRను గద్దల్లా ఎత్తుకుపోయారు, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటులోనూ జాప్యం జరుగుతోంది… మరి ఇదంతా వివక్ష కాదా? అని ఎంపీ ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వేటినీ మోదీ తెలంగాణాకు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెంకటేష్ నేత స్పష్టం చేశారు.

అనంతరం ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ…. ప్రధాని వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల హృదయాలు ఎంతో బాధపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నందుకు తెలంగాణాపై ప్రధాని మోదీ అక్కసు కనిపిస్తోందని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ గుజరాత్‌ను దాటిపోయిందని చెప్పుకొచ్చారు. బీజేపీ కొత్తరకం కుట్రలకు తెర లేపిందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ కాకినాడ తీర్మానం ప్రకారం తెలంగాణ ఇచ్చినట్లైతే వేల మంది యువకులు మరణించేవారు కాదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు అరవింద్, బండి సంజయ్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. విడిపోయి బాగుపడ్డామని ప్రజలు సంతోషపడుతున్న తరుణంలో కుట్ర రాజకీయాలను బీజేపీ నేతలు మానుకోవాలని కవిత హితవు పలికారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు, రైతులు బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని కవిత జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement