Friday, May 10, 2024

మోడీ-కేడీ కలిసి నాటకాలు, గుజరాతీకేం తెలుసు తెలంగాణ పోరాట విలువ: రేవంత్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి అథమ స్థాయికి దిగి మాట్లాడితే ఎలా ఉంటుందో ప్రధాని ప్రసంగం అలా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలుగు రాష్ట్రాల విభజనకు సంబంధించి మంగళవారం రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జవహర్ లాల్ నెహ్రూ, పీవీ నరసింహారావు, వాజ్‌పేయ్, మన్మోహన్ సింగ్ వంటి నేతల ప్రసంగాలు ఆదర్శవంతంగా, హుందాగా ఉండేవని రేవంత్ గుర్తు చేశారు. బడ్జెట్ సమయంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే, బడ్జెట్ సవరణల ద్వారా వాటిని సరిదిద్దే వారన్నారు.

తెలంగాణ ప్రజల పట్ల మోడీకి ఉన్న చిన్నచూపు, వ్యతిరేక భావన ఆయన మాటల్లో బయటపడిందని విమర్శించారు. ప్రజా ఉద్యమాల నుంచి మీరు ప్రధాని కాలేదు… మేనేజ్‌మెంట్ స్కిల్స్, కొద్ది మంది వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడం, మభ్యపెట్టడం ద్వారా ఈ స్థాయికి ఎదిగారని రేవంత్ రెడ్డి ప్రధానిపై ధ్వజమెత్తారు. గురువైన అద్వానీకే పంగనామాలు పెట్టిన చరిత్ర మీదంటూ దుయ్యబట్టారు. నమ్మించి మోసం చేయడంలో నమోకి ఉన్న అనుభవం దేశ ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. 1998 కాకినాడ తీర్మానంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని భారతీయ జనతా పార్టీ చెప్పిందని, ఆ తర్వాత 1999 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచే బీజేపీ 4 పార్లమెంటు స్థానాలు గెలుపొందిందని వివరించారు.

ఆ తర్వాత ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు ఏర్పాటైనా… తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఉంటే అనేక మంది తెలంగాణ బిడ్డలు అమరులయ్యే పరిస్థితి వచ్చేది కాదని, వారందరి ప్రాణాలు బలవ్వడానికి బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సోనియాగాంధీ ఏపీలో పార్టీ చచ్చిపోయినా సరే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర ప్రాంత ఎంపీలు, పెట్టుబడిదారులు ఎంత ఒత్తిడి చేసినా సరే తలొగ్గకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణను, తెలంగాణ జాతిని నరేంద్రమోడీ అవమానించారని, ఆయన విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.

చదువు సంధ్యా లేని మోడీ ప్రధాని అవ్వడం ఈ దేశం దురదృష్టమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏ బిల్లు పాస్ చేయాలన్నా తలుపులు మూసి, ఉన్న సభ్యులతో పాస్ చేస్తారని, రాజ్యసభలో చర్చలో పాల్గొన్న వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా సహా తదితర సవరణలు, సూచనలు చేశారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సుష్మా స్వరాజ్ బతికి లేకున్నా, ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుణ్ని అడిగితే మొత్తం తెలుస్తుందని సూచించారు. నరేంద్ర మోడీ చేతిలో మోసపోనివారు ఎవరైనా ఉన్నారా? తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, ఇవ్వకుండా మోసగించ లేదా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు సైతం ఇచ్చిన విభజన హామీలేవీ అమలు చేయట్లేదు… కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ITIRను రద్దు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే, విమర్శించే హక్కు ప్రధానికి లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ కోసం తన పదవిని త్యాగం చేయకుండా పారిపోయి దాక్కున్న చరిత్ర కిషన్ రెడ్డిదని, ఆయన ఇంకా కేంద్ర మంత్రి పదవిని ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారో చెప్పాలని నిలదీశారు. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా మీరేం చేస్తారో చెప్పండంటూ బీజేపీ తెలంగాణా ఎంపీలపై మండిపడ్డారు. గాడిదకేమి తెలుసు గంధం చెక్కల వాసన అన్న చందంగా గుజరాతీ మోదీకేం తెలుసు తెలంగాణ పోరాట విలువ అంటూ రేవంత్ విమర్శించారు. తెలంగాణ వీరుల గాథను అవమానించినా సరే టీఆర్ఎస్ ఎంపీలు కనీసం నిరసన తెలపలేదని, ఒకరినొకరు తిట్టుకొంటూ గాల్లో కత్తి ఊపుతూ పరస్పర ప్రయోజనాల కోసం బీజేపీ – టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. మోడీ-కేడీ కలిసి ఆడుతున్న నాటకాలను ప్రజలు ఆమోదించరని నొక్కి చెప్పారు. మోదీకి ఓట్లు కావాల్సిన ప్రతి సందర్భంలో నెహ్రూ, పటేల్, గాంధీల పేర్లను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తారన్న రేవంత్… ఒక్క ప్రసంగంలోనైనా వాజ్‌పేయి, అద్వానీల పేర్లను మోడీ ఒక్కసారైనా గుర్తు చేశారా అని ప్రశ్నించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement