Friday, April 26, 2024

సాగర్ ప్రచారానికి కమల దండు!

తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, ఈ విషయంలో బీజేపీ వెనుకబడి ఉంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసే వాళ్ల విషయంలో స్పష్టత రావడం లేదు. అయితే బీజేపీ తరపున ప్రచారం చేయడానికి కొంత మంది కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నాగార్జునసాగర్ లో సీఎం కేసీఆర్ కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అవసరం అయితే, కేటీఆర్ సహా తాను ప్రచారంలో పాల్గొంటానని కేసీఆర్ ప్రకటించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి బలంగా ఉండటంతో టిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి వంటి వాళ్లు కూడా ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. అవసరమైతే రాహుల్ గాంధీ కూడా తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా ఇటు తెలంగాణ కూడా వచ్చి నాగార్జునసాగర్ లో ఒక రోజు ప్రచారం చేసే అవకాశం ఉండవచ్చుననే ప్రచారం జరుగుతోంది.

ఇక బీజేపీ అగ్రనేతలు కొంతమంది నాగార్జునసాగర్ లో ప్రచారం చేయడానికి ఇప్పటికే మార్గం కూడా చేసుకున్నారని సమాచారం.

రాష్ట్ర పార్టీ నేతలు కొంతమంది కేంద్ర మంత్రులను రావాలని కోరారు అని కూడా అంటున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీజేపీ ఎక్కువగా ప్రచారం చేయాలి. లేకపోతే ఓడిపోయే అవకాశాలు కూడా ఉండవచ్చని అంటున్నారు. కొంతమంది రాజ్యసభ ఎంపీలు కూడా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. జానారెడ్డి ఎదుర్కోవడానికి ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కష్టపడుతున్నాయి. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మోదీసహా అమిత్ షా లాంటి ఆగ్ర నేతలు బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో ప్రచారంలో బీజీగా ఉన్నారు. దీంతో రవిశంకర్, ప్రకాశ్ జావదేకర్ లాంటి కేంద్ర మంత్రులను రంగంలో దింపాలని బీజేపీ నేతలు భావిస్తున్నారట. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు పునరావృతం చేయాలని భావిస్తున్న బీజేపీకి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు షాక్ కు గురి చేశాయి. దీంతో గెలుపు సంగతి పక్కన బెడితే..కనీసం రెండో స్థానానికి అయినా పోటీ పడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement