Friday, April 26, 2024

ఎన్నో ఏళ్ళుగా ఆర్మీలో బిపిన్ రావ‌త్ కుటుంబం … ఆయ‌న తండ్రి కూడా ..

ఆర్మీ హెలికాఫ్ట‌ర్ కూలిన ఘ‌ట‌న‌లో 14మంది మృతి చెందారు. కాగా వారిలో బిపిన్ రావ‌త్ తో పాటు ఆయ‌న భార్య కూడా దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. కాగా బిపిన్ త్రివిధ‌ద‌ళాధిప‌తిగా ఎలా ఎదిగారో చూద్దాం.. ఉత్త‌రాఖండ్ లోని పూరీలో 1958 మార్చి 16ర ఆయ‌న జ‌న్మించారు. అంతేకాదు బిపిన్ కుటుంబం ఇండియ‌న్ ఆర్మీలో ఎన్నో ఏళ్ళుగా సేవ‌ల‌ను కొన‌సాగిస్తున్నారు. బిపిన్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ భార‌త ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగి సేవ‌లందించారు. బిపిన్ రావత్ తన ప్రాథమిక విద్యను డెహ్రడూన్ లోని కాంబ్రియన్ హాల్ స్కూల్ లో ప్రారంభించారు. ఆ తర్వాత సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదివారు. ఆ తర్వాత ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరారు.

డెహ్రడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీలోకి ప్రవేశించారు బిపిన్ . అక్కడ బిపిన్ ప్రతిభకు ‘స్వోర్డ్ అఫ్ ఆనర్’ లభించింది. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC)-వెల్లింగ్టన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హయ్యర్ కమాండ్ కోర్సును యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజ్-ఫోర్ట్ లీవెన్ వర్త్ , కాన్సాస్ లో పూర్తి చేశారు. అలాగే మద్రాస్ యూనివర్సీటి లో డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ డిగ్రీ, మేనేజ్‌మెంట్ అండ్ కంప్యూటర్ స్టడీస్‌లో డిప్లొమాలను పూర్తి చేశారు. అలాగే, సైనిక మీడియా వ్యూహాత్మక అధ్యయనాల మీద పరిశోధనలకు గానూ మీరట్ లోని చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం ఫిలాసఫీలో డాక్టరేట్ అందించింది.

కాగా బిపిన్ 1978 డిసెంబర్ 16న గూర్ఖా రైఫిల్స్‌లోని 5వ బెటాలియన్‌లో చేరి తన ఆర్మీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన తండ్రి కూడా అదే యూనిట్ లో పనిచేస్తున్నారు. ఆయన యుద్ధ నైపుణ్యాలను గమనించిన ఇండియన్ ఆర్మీ పలు కీలక ఆపరేషన్లలో ఆయన సేవలను ఉపయోగించుకుంది. రావత్ కు యుద్ధ విద్యలో అపార అనుభవం ఉంది. దేశ వ్యతిరేక, తిరుగుబాటు కార్యకలాపాల నిరోధక ఆపరేషన్లలో పది సంవ‌త్స‌రాలు సేవలందించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని ఉన్న సమయంలో జమ్మూకాశ్మీర్ ఆర్మీ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

ర‌క్షణ రంగంలో ఇటీవల కాలంలో సంస్కరణలు ఊపందుకోవడానికి బిపిన్ ఆద్యుడు. ఆయన ఫోర్ స్టార్ జనరల్. లడఖ్ సంక్షోభ సమయంలో త్రివిధ దళాలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తలా వ్యవహరించారు. భారత్ తో కయ్యానికి చైనా వెనుకంజ వేసేలా చేయడంలో జనరల్ బిపిన్ రావత్ పాత్ర కీలకమైనది.దేశం కోసం ఆయన అందించిన సేవలకు గుర్తుగా అనేక సేవా మెడల్స్ వరించాయి. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం ఆయన అంకితభావానికి గీటురాళ్లు. బిపిన్ రావత్ అర్ధాంగి పేరు మధులిక రాజే సింగ్. వీరికి కృతిక, తరిణి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా 63ఏళ్ళ‌లో ఆయ‌న హెలికాఫ్ట‌ర్ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణం చెంద‌డం అత్యంత బాధాక‌రం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement