Monday, April 29, 2024

రచ్చబండ కార్యక్రమానికి అడ్డంకులు.. TRS ప్రభుత్వంపై భట్టి ఫైర్

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి అటంకాలు ఎదురవుతున్నాయి. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో గృహనిర్బంధం చేశారు. కాంగ్రెస్ శ్రేణుల హౌస్ అరెస్ట్ ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ సర్కారు చర్యపై మండిపడ్డారు.

దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించిన రాజ్యాంగానికి విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేయకుండ అడ్డుకోవడంపై ధ్వజమెత్తారు.  పోలీసులతో నిర్బంధం ప్రయోగించడం గత ఎనిమిది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పాలకులు అనుసరిస్తున్న పద్ధతి సరైంది కాదన్నారు.

టిఆర్ఎస్ నియంతృత్వ, నిరంకుశ పరిపాలనపై ఇక తెలంగాణ ప్రజలు ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పోలీసులతో నిర్బంధం ప్రయోగించి భావవ్యక్తీకరణ ఆపాలనుకోవడం సర్కార్ పెద్ద పొరపాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పోలీసులు హౌస్ అరెస్టు చేస్తే.. వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసేవారా ? అని ప్రశ్నించారు.

ధర్నాల విషయంలో టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం? ప్రతిపక్షాలకు మరో న్యాయమా? అని నిలదీశారు. ప్రజాస్వామ్య పాలనలో ఇదేం పద్దతి అని టిఆర్ఎస్ సర్కార్ ను అడిగారు. రచ్చబండకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు టిఆర్ఎస్ ధర్నాలను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.

TRS ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నాలు చేస్తే పోలీసుల చేత అరెస్టు చేయించాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు రైతులు వరి వేయొద్దు అని ఏ రాష్ట్ర సర్కార్ చెప్పలేదన్నారు. తెలంగాణ సర్కార్ చేతగానితనంతో వరి వేస్తే ఉరి అని ప్రకటించడం సిగ్గుచేటని విమర్శించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావాలని, ఆహార ఉత్పత్తి పెంచాలని, ఆహారధాన్యాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని చెప్పారు. అయితే, ఆ బాధ్యతను విస్మరించి రాష్ట్రంలో వరి పండించొద్దని ప్రభుత్వం పోలీసులు, అధికారులతో రైతులపై ఒత్తిడి చేయించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

- Advertisement -

గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నీటి వనరులతో రైతులు వరి పంటలు పండిస్తారన్న భట్టి.. యాసంగిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం ఎలా కొనుగోలు చేయవో చూస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని, అన్నదాతలు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే బీజేపీ, టీఆర్ఎస్ సర్కార్ లపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని భట్టి హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement