Friday, May 17, 2024

విమర్శలు చేసే ముందు అక్కడేం చేశారో చెప్పాలే.. విపక్ష నేతలకు కేటీఆర్​ సవాల్​

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. విమర్శలు చేయడం సులభం.. పనులు చేయడమే కష్టమని, విమర్శలు చేసే ముందు తమ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చేశారో చెప్పాలని సవాల్​ చేశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఇవ్వాల కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతోందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ఆదాయం పెరిగింది. రాజకీయం, ప్రజాజీవితంలో సంతోషం ఎక్కడ అనిపిస్తుందంటే.. ఇది పేదవాడి ప్రభుత్వమని సునీత చెప్పినప్పుడు సంతోషమేసింది. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నాం. మీరు పరిపాలించే రాష్ట్రంలో ఇలాంటి ఇండ్లను నిర్మించారా? అని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు.

‘‘బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పెన్షన్లు, డబుల్‌ బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి పథకాలు అమలవుతున్నాయో చెప్పాలని కేటీఆర్​ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పథకాల అమలుపై చర్చకు మీరు ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరికి వస్తానని స్పష్టం చేశారు. మాటలు చెప్పడం ఈజీ.. పనులు చేయడం కష్టం.. విమర్శ చేయడం అలక. విమర్శలు చేసే ముందు ఏం చేశారో చెప్పాలి. ప్రతి గ్రామంలో ఆశించినంత అభివృద్ధి జరుగుతోంది. సర్కార్‌ హాస్పిటల్లో రోగుల సంఖ్య పెరిగింది. వెంకటాపూర్‌ కూడా అభివృద్ధి బాటలో ముందుకెళ్తోంది. సిరిసిల్ల రూపుమార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement