Sunday, April 28, 2024

‘గెల్లు’ టికెట్ కు బాల్క ముల్లు!

హుజురాబాద్​ ఉపఎన్నికలో అభ్యర్థి ఎంపిక టీఆర్ఎస్ పార్టీలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. హుజురాబాద్​ టికెట్ ను ​గెల్లు శ్రీనివాస్ ​యాదవ్‌కు ఖరారైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు టికెట్ దక్కకుండా మరో వర్గం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థి నేతగా టీఆర్ఎస్‌లో గుర్తింపు పొంది, ప్రస్తుతం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే బాల్క సుమన్.. గెల్లు శ్రీనివాస్‌కు టికెట్ ​ఇవ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విద్యార్థి సంఘం తరుపున యూనివర్సిటీలో ఉద్యమానికి నాయకత్వం వహించిన తనకు మినహా మరెవ్వరికీ ప్రభుత్వంలో ప్రాధాన్యం ఉండరాదనే కోణంలో గెల్లుకు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యనభ్యసించిన గెల్లు శ్రీనివాస్.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బొంతు రామ్మోహన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్‌తో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనపై 128 పైగా కేసులు నమోదయ్యాయి. జైలు జీవితం కూడా గడిపారు. మానుకోట సంఘటనలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈటల రాజేందర్‌ తరచూ బీసీ నాయకుడినని, ఉద్యమకారుడినని ప్రజల్లో నినాదం వినిపిస్తుండటంతో ఆయనకు చెక్‌ పెట్టేందుకు యాదవ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ ని పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతోంది. కావాలనే ముందుగా ఆయన పేరు లీక్ చేశారని, సర్వేల రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

హుజురాబాద్​ నేతలతో మంత్రి హరీశ్​రావు ఇటీవల సిద్దిపేటలో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో గెల్లు శ్రీనివాస్​ ప్రధానంగా ఉండటం, ఆయనకు టికెట్​ ఇచ్చే చాన్స్ ​ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ విద్యార్థి నేతలు గెల్లుకు అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలుస్తోంది. గెల్లు శ్రీనివాస్‌కు టికెట్ ​ఇస్తే అక్కడ బీజేపీకి గెలుపుకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందని మాజీ విద్యార్థి నేత, ప్రస్తుత ఎమ్మెల్యే బాల్క సుమన్.. బాహాటంగానే వ్యాఖ్యానించినట్లు సమాచారం. గెల్లుకు హుజురాబాద్ ​ప్రాంతం నేతలతో సంబంధం లేదని, ఆయనకు ఓట్లు వేయరని గెల్లు వ్యతిరేక వర్గం గుసగుసలాడుకుంటున్నారు.

- Advertisement -

టీఆర్ఎస్ ​అనుబంధ విద్యార్థి సంఘం నుంచి ఇద్దరు నేతలు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం ఎమ్మోల్యే బాల్కకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే బాల్క సుమన్ అటు సీఎం కేసీఆర్, ఇటు మంత్రి కేటీఆర్ కోటరీలోనూ కీలకంగా ఉంటున్నారు. ఇప్పుడు అదే విద్యార్థి సంఘం నేతగా ఉన్న గెల్లు శ్రీనివాస్‌కు హుజురాబాద్ ​టికెట్ ఖరారై, ఉపఎన్నికలో గెలిస్తే తనకు పోటీగా ఈ కోటరీల్లో ఉంటాడనే భయం ఆయనకు వెంటాడుతోందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే గెల్లుకు టికెట్​ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: ఫ్యాక్ట్ చెక్: పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రాజయ్య క్లారిటీ

Advertisement

తాజా వార్తలు

Advertisement