Friday, April 26, 2024

బక్రీద్​: 2లక్షల పొట్టేళ్ల అమ్మకం.. ఒక్క హైదరాబాద్​లోనే 200 కోట్ల బిజినెస్​!

బ‌క్రీద్ పండుగ అంటే ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. దీంతో హైదరాబాద్​ సిటీలో పొట్టేళ్లు, గొర్రెలు, మేకలకు ఫుల్​ డిమాండ్‌ ఉంది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే పండుగ సందర్భంగా సిటీలో దాదాపు 2లక్షల జీవాలు అమ్ముడయినట్టు తెలుస్తోంది. ఇస్లామిక్ క్యాలెండర్ నెల ధుల్ హిజ్జా ప్రకారం ముస్లింలు 10వ రోజున బక్రీద్​ పండుగ జరుపుకుంటారు. దేశంలో ఈ పండుగను జులై 10వ తేదీ నుంచి జరుపుకుంటారు. ఈ సందర్భంగా గొర్రెలు, పశువులను ఒక పద్ధతిగా బలి ఇస్తారు.

ఈ సందర్భంగా మాంసాన్ని మూడు సమాన భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం స్నేహితులు, పరిచయస్తులు.. బంధువులకు పంపిణీ చేస్తే.. మరొక భాగం పేదలు, నిరుపేదలకు, మిగిలిన భాగాన్ని త‌మ‌కోసం ఉంచుకుంటారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన గొర్రెల వ్యాపారులు ఈ పండుగ‌కు భారిగా విక్ర యాలు జరిపినట్టు తెలుస్తోంది.

ఇక.. మార్కెట్‌లో దాదాపు 12 కిలోల మాంసం లభించే గొర్రెను 10వేలకు విక్రయించినట్టు తెలుస్తోంది. సాధారణంగా ముస్లింలు ఖుర్బానీ కోసం 11 కిలోల నుండి 14 కిలోల బరువున్న గొర్రెలను కొనుగోలు చేస్తారని జియాగూడ గొర్రెల మార్కెట్ కమీషన్ ఏజెంట్ తాజుద్దీన్ చెప్పారు. కొంత‌మంది ఒక్కొక్కటి 20వేల నుండి 50వేల వరకు ఉన్న పెద్ద పొట్టేళ్లను కొనుగోలు చేస్తార‌ని.. వీటిని కనీసం రెండు సంవత్సరాల పాటు యజమానులు ప్రత్యేకంగా పెంచుతారని తెలిపారు. వీటికి డ్రై ఫ్రూట్స్ తో కూడిన ప్రత్యేక ఆహారాన్ని తినిపిస్తారని, సంపన్నులుదీన్ని సామాజిక హోదాకు చిహ్నంగా భావించడమే కారణమని తెలుస్తోంది.  

కాగా, హైదరాబాద్​ సిటీలోని చంచల్‌గూడ, నానల్ నగర్, మెహిదీపట్నం, ఫలక్‌నుమా, ఖిల్వత్, చాంద్రాయణగుట్ట, షాహీన్‌నగర్, కిషన్‌బాగ్, ఆజంపురా, ముషీరాబాద్, గోల్నాక, బంజారాహిల్స్, జెహ్రా నగర్, బోరబండ, ఏసీ గార్డ్స్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్‌లలో గొర్రెల అమ్మకం జరిగింది. రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా పెద్దగా గొర్రెల అమ్మకాలు జరగలేదని, అయితే ఈసారి వ్యాపారులు ఆ  నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా రోడ్ల పక్కన తాత్కాలిక షెడ్​లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పొట్టేళ్ల అమ్మకాలు జరిపారు. ఇక ఈ సారి పండుగ మామూలుగా జరగలేదని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement