Thursday, May 2, 2024

కనీసం ఇన్‌చార్జినైనా మార్చండి, అధిష్టానంపై టీ-కాంగ్రెస్ సీనియర్ల ఒత్తిడి.. ప్రియాంకకు పర్యవేక్షణ బాధ్యతలు?

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతల అసమ్మతి రాగం తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ రాజీనామాలతో మరింత పెరిగింది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ సీనియర్లలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. భువనగిరి ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తుండగా, పార్టీ వీడిన ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ సైతం రేవంత్ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టారు.

పార్టీలో బహిరంగంగా విమర్శలు చేయనప్పటికీ పలువురు సీనియర్లు ఢిల్లీ అధిష్టానం పెద్దలను కలిసిన ప్రతిసారీ రేవంత్‌పై ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయన సీనియర్లను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రతి నియోజకవర్గంలో ప్రత్యామ్నాయంగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని, పార్టీలో తెలుగుదేశం నేతలను నింపి సీనియర్లను బయటకు పంపేందుకు కుట్ర చేస్తున్నారని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆరోపణలు చేస్తున్నారు.

ఇదంతా ఒకెత్తయితే, రేవంత్ రెడ్డిని కట్టడి చేస్తూ పార్టీలో అందరినీ కలుపుకుపోయేలా చూడాల్సిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్ సైతం రేవంత్ అడుగులకు మడుగులొత్తుతూ, పూర్తిగా రేవంత్ చేతిలో కీలుబొమ్మలా మారారని సీనియర్లు మండిపడుతున్నారు. నిజానికి రేవంత్ ఎంపికలో కీలక పాత్ర పోషించిన టాగోర్, రేవంత్ దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకు అనుకూలంగా నివేదికలిచ్చారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అటు రేవంత్‌ను మార్చాల్సిందిగా కొందరు, ఇటు ఇంచార్జిని మార్చాల్సిందిగా మరికొందరు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఈ ఇద్దరూ కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌ను సైతం తమకు అనుకూలంగా మలచుకున్నారని కొందరు సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ-నెహ్రూ కుటుంబ పెద్దలైన సోనియా – రాహుల్ గాంధీలలను కలిసి అక్కడే తేల్చుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. పైపెచ్చు తనకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కడాన్ని ‘హోంగార్డ్-ఐపీఎస్ అధికారి’ ఉదాహరణతో రేవంత్ రెడ్డి పోల్చడం కూడా సీనియర్ల అహాన్ని మరింత దెబ్బతీసింది. సీనియర్లు తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించడాన్ని ఒక ఉదాహరణతో పోలుస్తూ.. తనతో పాటు పనిచేసిన హోంగార్డు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఐపీఎస్ ర్యాంకు సాధించి, అదే జిల్లాకు ఎస్పీగా వస్తే తాను ఒప్పుకోనని మొదటి హోంగార్డు వాదించినట్టుగా ఉందని రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో వ్యాఖ్యానించారు.

దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే నిరనస వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ బయోడాటాలో ‘3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ హోంగార్డ్’ అని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకుంటూ బేషరతుగా క్షమాపణలు కోరాల్సి వచ్చింది. దీంతో పాటు చండూరు సభలో అద్దంకి దయాకర్ ఉపయోగించిన పరుష పదజాలాన్ని సైతం రేవంత్ తప్పుబడుతూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

- Advertisement -

ఇలాంటి అంతర్గత విబేధాలు, తగాదాల సంగతెలా ఉన్నా.. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చిందని మాణిక్యం టాగోర్ వంటి నేతలు అభిప్రాయపడుతున్నారు. అసమ్మతి రాగాలు, అసంతృప్తి స్వరాలు కాంగ్రెస్‌లో కొత్తకాదని, వాటిని ఎలా పరిష్కరించాలో అధిష్టానానికి తెలుసని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంతో పోల్చిచూసినా, కాస్తో-కూస్తో అవకాశాలు బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంతఃకలహాలతో పార్టీ నష్టపోకుండా జాగ్రత్తపడాల్సిన అనివార్యత అధిష్టానానికి ఏర్పడింది. పైపెచ్చు రోజురోజుకూ బలోపేతమవుతున్న బీజేపీ కారణంగా రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంటున్న సమయంలో.. సీనియర్ల సహాయ నిరాకరణకు మూల్యం భారీగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఈ క్రమంలో సీనియర్ల కోరిక మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిని మార్చే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినట్టు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కొత్తగా మరెవరినో నియమించకుండా.. ఏకంగా గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి ప్రియాంక గాంధే స్వయంగా రంగంలోకి దిగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకతో పాటు ముందస్తు ఎన్నికలకు సంకేతాలిస్తున్న తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీకి ప్రాణావసరంగా మారిన నేపథ్యంలో ప్రియాంక ఈ రెండు రాష్ట్రాల బాధ్యతలు చేపట్టవచ్చని తెలుస్తోంది. తదుపరి జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ సీనియర్లకు కొంత ఊరట లభించినట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement