Friday, May 3, 2024

బాబా రాందేవ్ అల్లోపతి వివాదం: కరోనాతో పతాంజలి సీఈవో మృతి!

అల్లోపతి వైద్యంపై ప్రముఖ యోగా గురు రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. రాందేవ్ బాబా వ్యాఖ్యలతో ఆయుర్వేద వైద్య విధానం వర్సెస్ అల్లోపతి వైద్యం అన్నట్లుగా సాగుతోంది. దీనిమీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఘాటుగా స్పందించారు. దీంతో వెంటనే రామ్ దేవ్ బాబా క్షమాపణలు చెప్పి.. ఆ వివాదానికి తెరదించారు. అయితే రామ్ దేవ్ బాబా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నోటీసులతో క్షమాపణలు చెప్పినా.. ఆ వెంటనే ఆయన ఐఎంఏకు 25 ప్రశ్నలు సంధించి గట్టి కౌంటరే ఇచ్చారు.

ఇది ఇలా ఉంటే ఈ నెల 19న కరోనతో పతంజలి డైరీస్ సీఈవో సునీల్ బన్సాల్ మృతి చెందారు. కరోనా కారణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. బ్రెయిన్ హెమరేజ్ కూడా వచ్చింది. అల్లోపతి వైద్యం వల్ల లక్షలకు లక్షలు నగదు ఖర్చు చేసినా లాభం లేదని రామ్ దేవ్ బాబా అన్నారు. ఆయన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలయ్యింది. ఆ తర్వాతే బన్సాల్ చనిపోయారు.

సునీల్ కి జరిగిన  కొవిడ్‌-19 ట్రీట్మెంట్ లో పతంజలి ఆయుర్వేద మందుల పాత్ర ఏమీ లేదని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. 57 ఏళ్ల వయసున్న సునీల్ బన్సాల్ మే 19న కరోనాతో జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని పతంజలి ఆయుర్వేద ప్రతినిధి ఎస్.కె. టిజరవాలా తెలిపారు. బన్సాల్ భార్య రాజస్థాన్ ఆరోగ్య విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారని, ఆయనకు జరిగిన అల్లోపతిక్‌ ట్రీట్మెంట్తో పతంజలి పాత్ర లేదని స్పష్టం చేశారు. పతంజలి డైరీ విభాగంలో 2018 నుంచి వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారని వివరించారు.

కాగా, అల్లోపతి వైద్యవిధానంపై రాందేవ్ బాబా అనుచిత వ్యాఖ్యలుతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆగ్రహానికి గురయ్యారు. కరోనా కట్టడిలో ఆధునిక వైద్యం విఫలమైందని, అదో పనికిమాలిందంటూ రాందేవ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా చికిత్సకు అల్లోపతి విధానం పనికిరాదని అంటున్నారని, దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ స్వ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టింది. తాను చేసిన వ్యాఖ్యలపై రాందేవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో క్షమాపణలు చెప్పిన రాందేవ్ బాబా సోమవారం(మే 24) మళ్లీ సరికొత్త వాదనలతో ముందుకొచ్చారు. కొన్నింటికి అల్లోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)కు 25 ప్రశ్నలు సంధించారు.

’’ బీపీ, మధుమేహానికి అలోపతిలో ఎందుకు శాశ్వత చికిత్స లేదు? థైరాయిడ్‌, ఆర్థరైటిస్‌, కోలిటిస్‌, ఉబ్బస వ్యాధుల శాశ్వత నివారణకు ఫార్మా కంపెనీల వద్ద మందులు ఉన్నాయా?. కాలేయ వ్యాధి చికిత్సకు, గుండెలో అడ్డంకులకు, కొవ్వుకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి?. పార్శపు నొప్పి, మతిమరుపు, పార్కిన్‌సన్‌ వ్యాధులను ఏ విధంగా నయం చేస్తారు?.  అలోపతి సర్వగుణ సంపన్నమని భావించకూడదు. ఎందుకంటే దీని వయసు 200 ఏళ్లే’’ అంటూ రాందేవ్ బాబా ప్రశ్నలనూ సంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement