Thursday, May 2, 2024

ఎస్ఈసీగా ముగ్గురి పేర్లు!

ఏపీలో ఎస్ఈసీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది. దీంతో ఏపీ ప్రభుత్వం కొత్త ఎన్నికల కమిషన్ నియామకానికి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు రిటైర్డ్ అధికారులతో కూడిన జాబితాను గవర్నర్ కు పంపినట్లు తెలుస్తోంది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, ప్రేమచంద్రా రెడ్డి, శామ్యూల్ పేర్లను గవర్నర్ కు ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో నీలం సాహ్నీ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎస్ గా పనిచేసి రిటైర్ అయిన నీలం సాహ్నీ.. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాన సలహాదారుగా పనిచేస్తున్నారు.

గతంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వెంటనే.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీగా నియమించింది. తర్వాతి పరిణామాలతో నిమ్మగడ్డ తిరిగిని పదవి చేపట్టారు. ఐతే జస్టిన్ కనగరాజ్ ను పరిగణలోకి తీసుకోకుండా కొత్త జాబితాను గవర్నర్ కు పంపడం గమనార్హం. సీనియారిటీ, సమర్ధత ఆధారంగా గవర్నర్ ఎస్ఈసీని నియమిస్తారు. నియామక ప్రక్రియ పూర్తైతే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రానికి కొత్త ఎస్ఈసీ వస్తారు.

మరోవైపు ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు.. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పటి నుంచి అటు ఎస్ఈసీకి ఇటు ప్రభుత్వానికి మధ్య వైరం నెలకొంది. దీంతో ఎస్ఈసీ పదవీకాలాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. అయితే, దీనిని సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. రాష్ట్ర ప్రభుత్వంపై విజయం సాధించి తిరిగి పదవిని చేపట్టారు.

అనంతరం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ సందర్భంలోనూ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీగా నడిచింది. కరోనా నేపథ్యంలో నోటిఫికేషన్ ఇవ్వడాన్ని  ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపైనా హైకోర్టు, సుప్రీం కోర్టులో వాదనలు జరగ్గా.. ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఎన్నికలకు సహకరించింది. దీంతో పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు ఏపీలో ప్రశాంతంగా ముగిశాయి. అయితే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మాత్రం ఇంకా నిర్వహించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నిమ్మగడ్డ హయాంలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో కొత్త ఎస్ఈసీ ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement