Wednesday, May 22, 2024

Spl Story: మరో స్వాతంత్ర్య పోరాటం, తెలంగాణ ఉద్యమం.. ఆత్మసాక్షాత్కారం అయితేనే ఆవిర్భావోత్సవం!

తెలంగాణ.. పసిపిల్లాడి నుంచి పండు ముదుసలి దాకా జైకొట్టిన నినాదం
తెలంగాణ.. ఆటగా, పాటగా.. ఆడిపాడిన సాంస్కృతిక సౌరభం
తెలంగాణ‌.. మ‌ట్టి వాస‌న‌లో, పూల సింగిడిలో విరిసిన స‌రికొత్త సోయ‌గం..
తెలంగాణ.. అది పేదవాడి కుటుంబమే కానీ, ధనవంతుడి కుటుంభమే అయినా.. ఎప్పుడో ఒకసారి రాలిన కన్నీటి ధార‌, చెమట చుక్క‌, రక్తపు మ‌ర‌క‌!

…ఇట్లాంటి నా తెలంగాణను కబ్జా చేయనీకి పాలిట్రిక్స్​ ముసుగులో కొత్త పన్నాగాలు పన్నుతున్నారు కొంత‌మంది లీడ‌ర్లు. ఇది తెలుసుకోనంత, అవగాహన చేసుకోనంత అమాయకులేం కాదు ఇక్కడి ప్రజలు.. అంతదాకా వస్తే మ‌రోసారి కొడవలి, సుత్తి, పలుగు, పార.. అన్నీ ఏకమై పోరాటం చేస్తయ్​.. బీ కేర్​ఫుల్​!

– నాగరాజు చంద్రగిరి, సీనియర్​ జర్నలిస్ట్​

======================

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించాని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి టూరిజం మంత్రిగా ఉండటంతో ఆయన శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణలోనూ, ఢిల్లీలోనూ ఇట్లాంటి వేడుకలను నిర్వహిస్తోంది. కానీ, ఈసారి కొత్తగా కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆవిర్భవోత్సవాలను చేయాలని నిర్ణయించడం ఆసక్తికరంగ మారింది.

- Advertisement -

కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోరాట పటిమ.. యావత్​ తెలంగాణ ప్రజనీకం కలిసి చేసిన ఆందోళనలు.. ఎందరో విద్యార్థులు, యువకుల ఆవేదన, ఆందోళనతో చేసిన ప్రాణత్యాగాలు.. సబ్బండవర్గాలు ఒక్కటై పాటగా, ఆటగా.. కదం తొక్కిన రోజులవి. అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం ఒకసారి తెలంగాణ బిల్​ పెడతానంటే.. తెలంగాణలో ఉన్న ప్రభుత్వం అడ్డుకోవడం, దానికి సపోర్టుగా చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా తెలంగాణకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలు ఎవరూ మరిచిపోలేనివి. కానీ, చావో రేవో తేల్చుకోవాలనే పట్టుదలతో కేసీఆర్​ చేసిన ఆమరణ దీక్షతో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్​ సర్కారు దిగి వచ్చింది. దానికి అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ లీడర్లు కూడా సపోర్టు చేశారు. కొన్ని అంతరాయాల నడుమ.. లగడపాటి అతి చేష్టలతో పార్లమెంట్​లో గందరగోళం నెలకొంది. అయినా ఆఖరుకు తెలంగాణ పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షలను గుర్తించిన కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ ఎట్లాగైనా తెలంగాణ బిల్​ పాస్​ చేయించాలని అభిలషించారు.

తెలంగాణ రాష్ట్రం ప్రకటనతోనే మళ్లీ ఈ గడ్డపై అడుగుపెడతానని శపథం చేసి ఢిల్లీ వెళ్లిన పోరాట యేధుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తను అనుకున్నట్టుగానే శపథం నెరవేర్చుకుని తిరిగి ఈ నేలపై అడుగుపెట్టారు. అట్లాంటి శుభ తరుణంలో కొంతమంది గోడమీద పిల్లివాటంలా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు కూడా అప్పట్లో తెలంగాణ రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని నేటకీ కొంతమంది గుర్తు చేస్తుంటారు. అయినా యావత్​ తెలంగాణ ప్రజలను ఏకం చేయాలన్న కేసీఆర్​ సంకల్పం ముందు ఈ చిన్న చిన్న అంశాలు, రాజకీయ కోణంలో వాటిని పట్టించుకోవద్దనే పెద్ద మనసు ఉంటుందని విశ్లేషకులు చెబుతుంటారు..

ఇంత జరిగి..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణత్యాగం చేసిన యువతను ‘అన్ సంగ్ హీరోస్’ పేరుతో ప్రస్తావించడం మొదలు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ కట్టడాల గొప్పదనం, నిర్మాణ శైలి తదితరాలన్నింటినీ యాది చేసుకుంటూ కొత్తగా, కొంగొత్తగా.. ఈ భారత భూమిపై మరో ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న సర్కారు నిధులు ఇవ్వకుండా, కొర్రీలు పెట్టి, పంచాయితీలు చేస్తూ.. నీళ్ల విషయంలో.. నిధుల విషయంలో సహకరించకపోయినా.. తెలంగాణ సర్కారు తనకు తాను స్వతంత్రంగా వ్యవహరిస్తూ.. అన్నిటినీ దాటుకుని ముందుకు సాగుతోంది.

దేశానికి రోల్​మోడల్​గా మారిన ఈ ఎర్రనేల మోల్​ని అనుకరిస్తున్నాయి చాలా రాష్ట్రాలు. కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్​ లేకున్నా డెవలప్​మెంట్​లో, ప్రభుత్వ పథకాల అమలులో ధైర్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడలేని మమకారం పుట్టుకొచ్చింది. ఇన్నేండ్లకు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలన్న సోయి వచ్చింది. ఎందుకంటే.. మున్ముందు జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు బీజేపీ కొత్త నాటకానికి తెరతీస్తోందన్న వాదన రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. దానికే ఈ తతంగం అంతా చేస్తోందని, ఇంతకుముందు ఎన్నడూ లేనిది ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఆవిర్భావోత్సవాలు నిర్వహించడం దానిలో భాగమేనని అంటున్నారు పొలిటికల్​ అనలిస్టులు. ఆవిర్భావోత్సవాలు చేయడం సంతోషమే కానీ, తెలంగాణకు ఎట్లాంటి సపోర్ట్​ చేయకుండా, తెలంగాణ ప్రజల కలల సాకారం అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కానీ, రావణకాష్టంలా మారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ మధ్య నిత్యం చిచ్చులా మారిన కృష్ణా జలాల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చొరవ చూపడం లేదు. కానీ, పోరాడి గెలిచిన తెలంగాణ ప్రజలను ఎక్కి స్వారీ చేయాలన్న కుట్ర మాత్రం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోందంటున్నారు చాలా మంది లీడర్లు.

కాగా, ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్‌లో గురువారం సాయంత్రం తెలంగాణ ఆవిర్భవ ఉత్సవ కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తుండగా, కేంద్ర సాంస్కృతిక విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఇక తెలంగాణ సింగర్ హేమచంద్ర సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ ఏర్పడినందున దానికి ప్రతీకగా అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో తొలిసారి కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ వేడుకలు..
కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ తెలంగాణ ఫార్మేషన్ డే ఉత్సవాలను నిర్వహించడంపై ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకూ ఢిల్లీ వేదికగా తెలంగాణ భవన్ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వమే ప్రతీ ఏటా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కూడా కేటాయిస్తోంది. అప్పట్లో కేంద్ర మంత్రులను ఆహ్వానించి సత్కరించేవారు. ఈ సారి కూడా ఇట్లాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే సమయానికి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సైతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆవిర్భావ ఉత్సవాలు జరగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో పోటాపోటీగా నిర్వహిస్తున్నారన్నమాట.

పోటాపోటీగా వేడుకల వెనుక రాజకీయ ఎజెండా ?
తెలంగాణలో రాజకీయంగా సున్నితమైన పరిస్థఇతులు ఏర్పడ్డాయి. తెలంగాణ ఏర్పాటు విషయంపై ప్రధాని మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం చేశారు. నిరసనలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా కూడా మారిందనే చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement