Saturday, May 4, 2024

ఈనెల 26న ఏపీలో బస్సులు బంద్

ఏపీలో మళ్లీ బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు ఈనెల 26న బంద్‌కు పిలుపునిచ్చాయి. ఏపీలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచేందుకు ఈ బంద్‌కు ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మద్దతు ఇవ్వగా.. తాజాగా అధికార పార్టీ వైసీపీ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 26న మధ్యాహ్నం వరకు బస్సులు డిపోకే పరిమితం అవుతున్నట్టు మంత్రి పేర్ని నాని ప్రకటన చేశారు. కార్మిక సంఘాలకు మద్దతు కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంటును కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం తిరస్కరించిందని, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బిడ్డింగులో పాల్గొనమని కేంద్రం సూచించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇక ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పట్టే పరిస్థితి వస్తుందన్నారు. ప్రత్యేక హోదా గురించి టీడీపీకి మాట్లాడే హక్కే లేదన్న ఆయన బీజేపీ చెప్పులు తుడిచే పనిలో టీడీపీ బీజీగా ఉందని ఆరోపించారు.

అంతకుముందే ఈ భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగు దేశం కార్యకర్తలు, నాయకులు భారత్ బంద్‌‌లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ సహకారంతోనే పోస్కోతో ఒప్పందం కుదిరిందన్న ఆయన ఉక్కు ప్రైవేటీకరణకు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం అడుగులు వేస్తుంటే వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అటు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా బంద్‌కు మద్ధతు ఇచ్చారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ ఏకమై దేశంలో జరుగుతున్న ఈ ప్రైవేటీకరణలను వ్యతిరేకించాలని ఆయన పిలుపు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ, టీడీపీలు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం చేయాలని కోరారు. దేశంలో ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే కచ్చితంగా అంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement