Wednesday, May 1, 2024

రోడ్లన్నీ గులాబీమయం.. టీఆర్ ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవానికి భారీ ఏర్పాట్లు

(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి) : తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినోత్సవం ఊరూరా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిదింటికే గ్రామాలు, పట్టణాల పరిధిలో పార్టీ జెండాలు ఆవిష్కరించాలి…గ్రామాల పరిధిలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు వివరించాల్సి ఉంటుంది….వ్యవస్థాపక దినోత్సవం జరిగే హెచ్‌ఐసీసీ చుట్టూరా ప్రాంతాలు గులాబీమయంగా మారాయి. ప్రధాన రోడ్లుకు ఇరువైపుల గులాబీజెండాలు…సీఎం కేసీఆర్‌…యువనేత కేటీఆర్‌ ఫోటోలే దర్శనమిస్తున్నాయి….తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి 21 వసంతాలు అవుతున్న నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో హెచ్‌ఐసీసీలో భారీ ఏర్పాట్లు చేశారు. మూడు వేలకు పైగా అతిథులు వచ్చే అవకాశం ఉన్నందునా వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం ఎలాంటి సందేశం ఇస్తారనేది పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల్లో ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటై 21 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రాధాన్యం నెలకొంది. రానున్న ఏడాది నుండి ఎన్నికల ఇయర్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చే సందేశం కీలకం కానుంది. ఇందులో పలు తీర్మానాలు చేపట్టనున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులో కీలక తీర్మానాలు కూడా చేయనున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే 90వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. తొలి విడత పోలీసు ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో బుధవారం నిర్వహిస్తున్న పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ప్రాధాన్యం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement