Saturday, May 4, 2024

Delhi: 9 గంటలపాటు సీబీఐ ప్రశ్నల మీద ప్రశ్నలు.. ఇదంతా ‘ఆపరేషన్​ లోటస్​’ కుట్ర అంటున్న సిసోడియా

వ్యాపారవేత్త విజయ్ నాయర్‌తో సహా ఢిల్లీ లిక్కర్​ కేసులో అనుమానితులను సీబీఐ విచారణ జరుపుతోంది. ఇవ్వాల (సోమవారం) ఈ కేసులోని ఇతర వ్యక్తులతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు ఉన్న సంబంధాలు, సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న పత్రాల గురించి దాదాపు 9 గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. కాగా, ఈ కేసు మొత్తం బీజేపీ కుట్రలో భాగంగా కొనసాగుతోందని, తనను బీజేపీలో చేరితే ఈ కేసు నుంచి విముక్తుడిని చేస్తాననే ఆఫర్​ ఇచ్చినట్టు సిసోడియా ఆరోపించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ ఇవ్వాల (సోమవారం) 9 గంటలకు పైగా చేపట్టిన విచారణ ముగిసింది. కేంద్ర ఏజెన్సీ ప్రధాన కార్యాలయం నుండి బయలుదేరిన వెంటనే AAP నాయకుడు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు మొత్తం “ఆపరేషన్ లోటస్” ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు చేసిన కుట్రలో భాగమని పేర్కొన్నారు. ఆప్ నుంచి వైదొలగాలని తనపై ఒత్తిడి తెచ్చారని సిసోడియా ఆరోపించారు. ఆప్ నుండి వైదొలగాలని తనపై ఒత్తిడి తెచ్చారని, తనకు ఢిల్లీ సీఎం పదవి కావాలో.. జైలు శిక్ష కావాలో ఆలోచించుకోవాలని కండిషన్​ పెట్టారన్నారు. 

సిసోడియా సోమవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. నేరుగా అవినీతి నిరోధక శాఖలోని మొదటి అంతస్తుకు తీసుకెళ్లారని అధికారులను ఉటంకిస్తూ పిటిఐ నివేదించింది. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ, వ్యాపారవేత్త విజయ్ నాయర్‌తో సహా ఇతర నిందితులతో ఆయనకున్న సంబంధాలు, సోదాల్లో దొరికిన పత్రాలపై ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలోని పలు అంశాలపై ఆయనను తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నలమీద ప్రశలు వేసి వేధించినట్టు తెలుస్తోంది.

ఈ కేసులో వైఎస్సార్‌సీపీ లోక్‌సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. తన ప్రశ్నానంతరం విలేకరులతో మాట్లాడిన సిసోడియా, మొత్తం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఎత్తుగడ అని అన్నారు. ‘‘ఈరోజు సీబీఐ కార్యాలయంలో ఎలాంటి కుంభకోణం (ఎక్సైజ్ పాలసీ కేసు) లేదని నేను చూశాను. ఈ కేసు మొత్తం నకిలీదని, ఈరోజు తొమ్మిది గంటల విచారణలో నాకు అవన్నీ అర్థమయ్యాయి. ఈ కేసు ఏ స్కామ్‌పై విచారణకు కాదు. ఆపరేషన్ లోటస్‌ను విజయవంతం చేసేందుకు ఈ కేసు నడిపిస్తున్నారు” అని సిసోడియా చెప్పినట్లు వార్తా సంస్థ ANI పేర్కొంది.

- Advertisement -

ఇక.. సిసోడియా సీబీఐ కార్యాలయం నుండి బయటికి వచ్చిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. డిప్యూటీ సీఎం మనీష్​ సిసోడియా మంగళవారం గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళతారని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement