Friday, May 3, 2024

పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఊడ్చిన ఆప్.. ప్రధాన పార్టీల అడ్రస్ గల్లంతు

పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచ‌ల‌నం సృష్టించింది. ఎన్నికల కౌంటింగ్‌లో అత్యధిక స్థానాల్లో లీడింగ్‌లో కొన‌సాగుతోంది. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 88పైగా సీట్లుల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 59 కంటే ఎక్కువ స్థానాల్లో ప్రస్తుతం ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ప్రకటించిన మ్యానిఫెస్టోకు, హామీలకు ప్రజలు ఫిదా అయ్యారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్​ ప్రభావం చూపలేక చతికిలపడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆప్ ఊడ్చేసింది.

2017 ఎన్నికల్లో ఆప్ కేవలం 20 సీట్లకే పరిమితం అయింది. అయితే, ఈసారి మాత్రం ప్రభంజనం సృష్టించింది. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. అన్ని సంస్థలు ఆప్ కు 60 -70 సీట్ల వరకు వస్తాయని చెప్పాయి. అయితే, ప్రస్తుతం అంతకు మించి అధిక స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతూ తన సత్తా చాటుకుంది. ఊహించిన ప్రజా మద్దతు కూడగట్టు కొని అది పెద్ద పార్టీగా..అత్యంత మెజార్టీ సీట్లతో పగ్గాలు చేపడుతోంది.

మరోవైపు పంజాబ్ లో అధికార కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. సీఎంగా ఉన్న చన్నీ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ వెనుకబడి ఉన్నారు. అమృత్​సర్​తూర్పు స్థానంలో సైతం వెనుకబడి ఉన్నారు. మాజీ సీఎం అమరీందర్ సింగ్ పార్టీని వీడిన ప్రభావం కాంగ్రెస్ పైన పడింది. అంతేకాదు అంతర్గత విభేదాలు, పీసీసీ అధ్యక్షుడు సిద్దూ రాజేసిన అసమ్మతి రాజకీయం మొత్తంగా కాంగ్రెస్ ను పంజాబ్ లో దెబ్బ తీసింది. దీంతో ఘోర పరాజయం పాలైంది.  

ఇక, రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అయిన శిరోమణి అకాలీదళం 7 స్థానాలకే పరిమితం అయింది. ఇక, బీజేపి 4 స్థానాల్లో..ఇతరులు ఒక్క స్థానంలో లీడ్ లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్ హేమా హేమీలను మట్టి కరిపించింది. సీఎం చన్నీ చమకూర్‌ సాహిబ్‌, బదౌర్‌ స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు ప్రకాష్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్, రాజిందర్ కౌర్ భట్టల్ కూడా వెనుకంజలో ఉన్నారు. SAD అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా తన జలాలాబాద్ స్థానంలో వెనుకబడి ఉన్నారు. ఆప్ దెబ్బకు అన్ని పార్టీలు అడ్రస్ గల్లంతు అయింది.  ఆప్ ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో లంబి, పాటియాలా అర్బన్, లెహ్రా, ఆనంద్‌పూర్ సాహిబ్, బటాలా, అత్తారి, బటిండా అర్బన్, దసూయా, డేరా బస్సీ, ధరమ్‌కోట్, దీనా నగర్, దిర్బా, ఫిరోజ్‌పూర్ రూరల్ మరియు గిల్ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement