Thursday, May 2, 2024

కొవిడ్‌ కేంద్రాల్లో 33 వేల బెడ్స్ ఏర్పాటు: ఆళ్ల నాని

రాష్ట్రంలో ఆక్సిజన్ లోటు లేకుండా చూస్తున్నామని ఏపీ వైద్యారోగ్య మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కొవిడ్‌ కేంద్రాల్లో 33 వేల బెడ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మంత్రుల కమిటీలో కరోనా నియంత్రణ చర్యలపై చర్చించామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కోవిడ్ పరీక్షలు, బెడ్స్, డాక్టర్ల పర్యవేక్షణ, హెల్ప్ డెస్క్ లు, 104, జిల్లా అధికారులు పనితీరు పైన చర్చించినట్లు వివరించారు. ఏపీలో మరణాల సంఖ్యను తగ్గేలా చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి నాని చెప్పారు. 60 కొవిడ్ కేర్ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. 17 వేల బెడ్స్ ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. రెమ్‌డిసివిర్ ఇంజక్షన్ల అక్రమాల నిరోధానికి విజిలెన్స్‌ను ఉపయోగిస్తున్నామని, కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని ఆళ్ల నాని తెలిపారు. ప్రభుత్వ , నెట్ వర్క్ హాస్పిటల్స్ లో ఎక్కడ ఏ లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కోవిడ్ పేషెంట్ పూర్తిగా చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికి వెళ్లాలని సీఎం చెప్పారని గుర్తు చేశారు.

కరోనా విపత్కర సమయంలో కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా.. ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు తెచ్చుకోలేదని విమర్శించారు. మరణాల రేటుకు ప్రభుత్వం  సరిగా చెప్పడం లేదని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రానికి వస్తే ఇక్కడి ప్రజలు ఆయనపై ఎంత కోపంతో ఉన్నారో అర్థం అవుతుందని హెచ్చరించారు. లోకేష్ స్కూల్ పిల్లలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఆక్షేపించడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్రతి సలహా ప్రజలకు కీడు చేసేదే అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని, ఎక్కడైనా ఒక్క పొరపాటు జరిగినా తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. అధికారులు, వైద్యులు కావాలని నిర్లక్ష్యంగా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలో చిన్నారి మృతికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి ఆళ్ల నాని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement