Saturday, May 4, 2024

మోదీకి 24 గంట‌ల డెడ్‌లైన్, ఇక తాడోపేడో తేల్చుకుంటాం : సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ‌: కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జలు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని.. ఇక తాము తాడోపేడో తేల్చుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు సీఎం కేసీఆర్. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. దేశంలోని రైతులు భిక్ష‌గాళ్లు కాదు.. ఒకే విధానం లేక‌పోతే రైతులు రోడ్ల‌పైకి వ‌స్తార‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మోదీ, పీయూష్ గోయ‌ల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని కోరుతున్నా అన్నారు కేసీఆర్.. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా ఇవ్వాల (సోమ‌వారం) టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్ష‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వ‌చ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వ‌చ్చి ఆందోళ‌న చేయ‌డానికి కార‌ణ‌మెవ‌రు? న‌రేంద్ర మోదీ ఎవ‌రితోనైనా పెట్టుకో.. కానీ రైతులతోని మాత్రం పెట్టుకోవ‌ద్దు. ప్ర‌భుత్వంలో ఎవ‌రూ శాశ్వతంగా ఉండ‌రు. కేంద్రం ధాన్యం కొనాల‌ని ఢిల్లీలో దీక్ష చేస్తున్నాం. దీక్ష‌కు మ‌ద్ద‌తిచ్చేందుకు వ‌చ్చిన రాకేశ్ తికాయ‌త్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు కేసీఆర్. ఉద్య‌మాల పోరాట ఫ‌లితంగా 2014లో తెలంగాణ వ‌చ్చింద‌ని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రం వ‌చ్చాక రైతుల కోసం అనేక సంస్క‌ర‌ణ‌లు తెచ్చామ‌ని తెలిపారు. రైతుల‌కు ఉచితంగా 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ అందిస్తున్నాం. మిష‌న్ కాక‌తీయ ద్వారా చెరువుల‌ను పునరుద్ధ‌రించాం. ప్రాజెక్టుల‌ను పూర్తి చేసుకున్నాం. సాగుకు స‌రిప‌డా నీటిని అందిస్తున్నామ‌ని చెప్పారు. తెలంగాణ‌లో కోటి ఎక‌రాల భూమి సాగులోకి వ‌చ్చింద‌న్నారు. ప్ర‌ధాని స్వ‌రాష్ట్రం గుజ‌రాత్‌లో విద్యుత్ కోసం రైతుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌ని, తెలంగాణ‌లో రైతుల‌కు ఉచిత విద్యుత్ అందించి ఆదుకుంటున్నామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement