Wednesday, May 22, 2024

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘోరం.. ఆక్సిజన్ అందక 11 మంది మృతి

తిరుపతి రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో కనీసం 11 మంది కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు ప్రెజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో ఐసీయూలోని బాధితులు ఊపిరాడక అల్లాడారు. అత్యవసర శ్వాస ఆడించేందుకు వైద్యులు సీపీఆర్‌ చేశారు. బంధువులు కూడా బాధితులకు గాలి ఆడేందుకు అట్టముక్కలతో విసిరారు. ఆక్సిజన్‌ ట్యాంకు ఖాళీ కావడంతో 5 నిమిషాల పాటు సరఫరా నిలిచిపోయిందని, శ్రీపెరంబూర్‌ నుంచి ఆక్సిజన్‌ రవాణా ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాకతో సరఫరాను సాంకేతిక బృందం పునరుద్ధరించింది. ప్రస్తుతం బాధితులకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.

కాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు గల కారణాలను రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతిని ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ ట్యాంకర్ రావడం ఆలస్యం కావడం వల్లే ఈ ఘటన జరిగిందని డా.భారతి వివరణ ఇచ్చారు. కాగా ఆక్సిజన్ అందక మృతిచెందిన వారి కుటుంబాలకు మంత్రి ఆళ్ల నాని సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement