Sunday, April 28, 2024

IPL : ఎవ‌రీ అశుతోష్ శ‌ర్మ ..

చాలీచాలని గదుల్లో ఇబ్బందిపడ్డాడు.. రోజువారి ఆహారం కోసం ఎన్నో చోట్ల పని చేశాడు. క్రికెటర్‌గా ఎదిగే అవకాశం లేకపోవడంతో అంపైర్‌గా అయినా మైదానంలో ఉంటే చాలు అనుకున్నాడు! అలాంటి కుర్రాడు ఐపీఎల్ లాంటి మెగా టోర్నీకి ఎంపిక కావడమే ఓ చిత్రమైతే.. అద్భుతమైన ఆటతో పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదగడం మరో చిత్రం! అతడే అశుతోష్‌ శర్మ.

హైదరాబాద్‌పై 15 బంతుల్లోనే 33.. గుజరాత్‌పై 17 బంతుల్లో అజేయంగా 31..రాజస్థాన్‌పై 16 బంతుల్లోనే 31 పరుగులు… లేటెస్ట్‌గా ముంబయిపై 28 బంతుల్లో 61…. ఈ గణాంకాలు చాలు అశుతోష్‌ సత్తా ఏంటో చెప్పడానికి. మధ్యప్రదేశ్‌లోని రాత్లామ్‌ గ్రామానికి చెందిన అతడు క్రికెటర్‌గా ఎదగడం నిజంగా పెద్ద విశేషమే. ఎందుకంటే అతడి కుటుంబానికి ఆర్థిక స్థోమత లేదు. అయినా కూడా అశుతోష్‌ మాత్రం ఆటపై ప్రేమని చంపుకోలేదు. భారత మాజీ క్రికెటర్‌ అమే కురేసియా పరిచయం కావడం అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. అతడి అండతో నెమ్మదిగా వివిధ టోర్నీల్లో సత్తా చాటాడు. తిండి కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు.

- Advertisement -

..

ఎనిమిదేళ్ల వయసులో అశుతోష్‌ రాత్లామ్‌ నుంచి ఇండోర్‌కు శిక్షణ నిమిత్తం వచ్చాడు. మధ్యప్రదేశ్‌ తరఫున లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో రాణించి అందరి దృష్టిలో పడ్డాడు. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన అతడు హార్డ్‌ హిట్టర్‌గా పేరు సంపాదించాడు. 2019లో సయ్యద్‌ ముస్తాక్‌అలీ టోర్నీ తుది పోరులో 84 పరుగులు చేసి సత్తా చాటాడీ కుర్రాడు. కొవిడ్‌-19 రావడంతో అతడి కెరీర్‌కు బ్రేక్‌ పడింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలేమీ రాలేదు. ఎంతగా రాణించినా రిజర్వ్‌ బెంచ్‌పైనే కూర్చోబెట్టేవాళ్లు. దీనికి తోడు ఇల్లు గడవడం కష్టమైంది. ఆటతో అనుబంధాన్ని తెంచుకోలేక డబ్బులు కూడా వస్తాయి అన్న ఆశతో అంపైరింగ్‌ చేశాడు. ఇక తాను క్రికెటర్‌గా ఎదగడమే కష్టమని భావించాడు.

యువీ రికార్డును కొట్టి..

2023 ముస్తాక్‌ అలీ టోర్నీ అశుతోష్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. టీ20ల్లో యువరాజ్‌ సింగ్‌ సాధించిన రికార్డును బద్దలు కొట్టడంతో అతడు క్రికెటింగ్‌ సర్కిల్స్‌లో అందరికి పరిచయమైపోయాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌పై 11 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి ఔరా అనిపించాడీ హిట్టర్‌. టీ20లకు తాను పక్కాగా పనికొస్తానని మరోసారి రుజువు చేశాడు. యార్కర్‌ లెంగ్త్‌లో పడిన బంతులను సైతం స్టాండ్స్‌లోకి కొట్టడం.. హై బ్యాక్‌ లిఫ్ట్‌తో బంతిని బాదేయడం ఈ కుర్రాడి స్టయిల్‌. దీంతో 2024 ఐపీఎల్‌ వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు ఈ ఆల్‌రౌండర్‌ను పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. తనపై ఉంచిన నమ్మకాన్ని ఈ అతడు వమ్ము చేయలేదు.

కీలక సమయాల్లో ఆ జట్టును ఆదుకున్నాడు అశుతోష్‌. ఓ మ్యాచ్‌లో విజయాన్ని కూడా అందించాడు. గుజరాత్‌ టైటాన్స్‌పై 17 బంతుల్లోనే 31 పరుగులు చేసి పంజాబ్‌ను గెలిపించాడు. ముంబయితో గురువారం జరిగిన మ్యాచులో జట్టును విజయం అంచులకు తీసుకెళ్లాడు. కొన్ని షాట్లు చూస్తుంటే మరో సూర్యకుమార్‌ యాదవ్‌ను చూసినట్లే ఉందని మాజీ క్రికెటర్లు అంటుండటం విశేషం. అగ్రశ్రేణి భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సంధించిన యార్కర్‌ను సిక్సర్‌గా మలచడంలో అతడి ప్రతిభ కనిపిస్తుంది. అయితే పంజాబ్‌ ఓడుతున్నా అశుతోష్‌ మాత్రం అవకాశాలను వృథా చేయట్లేదు. మున్ముందు అతడెలా రాణిస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement