Wednesday, May 1, 2024

Ashwin : రోహిత్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం… అశ్విన్

రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ మధ్యలో చెన్నైకి వెళ్లిన విషయం తెలిసిందే. తన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో ఉండటంతో బీసీసీఐ అనుమతితో అశ్విన్ చెన్నైకి వెళ్లి తిరిగొచ్చాడు. అయితే ఆ రోజు జరిగిన సంఘటనలను అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకున్నాడు. ఆ సమయంలో రోహిత్ శర్మలో ఓ గొప్ప నాయకుడిని చూశానని భావోద్వేగంతో తెలిపాడు.

- Advertisement -

”ఆ రోజు గదిలో కూర్చొని ఏడుస్తున్నాను. ఎవరి ఫోన్ కాల్స్‌కు ఆన్సర్ చేయట్లేదు. నేను ఎలా ఉన్నానని రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ నా దగ్గరికి వచ్చారు. నేను ఏం ఆలోచించేలేకపోతున్నానని వాళ్లతో చెప్పా. నేను తుదిజట్టులో ఉన్నాను. ఒకవేళ నేను వెళ్లిపోతే పది మందితో ఆడాల్సి ఉంటుంది. మరోవైపు అదే సమయంలో మా అమ్మతో చివరిసారిగా మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తున్నా. అక్కడ నుంచి వెళ్లి మా అమ్మను చూడాలనిపించింది.”

”అమ్మ పరిస్థితి ఎలా ఉందని, స్పృహలో ఉందా అని డాక్టర్‌ను అడిగాను. ఇప్పుడు ఆమెను చూసే పరిస్థితి లేదని డాక్టర్ చెప్పాడు. ఆ తర్వాత కన్నీటిని ఆపుకోలేకపోయాను. ఫ్లైట్ కోసం సెర్చ్ చేశాను. కానీ అందుబాటులో ఏమీ లేవు. రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో సాయంత్రం ఆరు గంటల తర్వాత విమానాలు లేవు. ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలియలేదు”

”ఆలోచించడం మానేసి, మా ఫ్యామిలీ వద్దకు వెళ్లమని రోహిత్ నాతో అన్నాడు. నా కోసం ప్రత్యేక విమానం సిద్ధం చేయడానికి ప్రయత్నించాడు. అంతేగాక ఫిజియో కమలేశ్‌ను నాతో పాటు చెన్నైకి వెళ్లమని సూచించాడు. టీమిండియాతో ఉన్న ఇద్దరు ఫిజియోల్లో కమలేశ్ ఒక్కడు. కమలేశ్‌ను జట్టుతోనే ఉండమని చెప్పాను. కానీ సెక్యూరిటీ చెకింగ్ దగ్గరకు నేను వెళ్లేసరికే కమలేశ్ వచ్చేసి నాకోసం ఎదురుచూస్తున్నాడు.

”ఆ కష్టసమయంలో కమలేశ్‌కు రోహిత్ ఫోన్ చేసి నాతో తోడుగా ఉండమని, నన్ను చూసుకోమని చెప్పాడు. అప్పటికీ రాత్రి 9.30 అయ్యింది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న నాతో కమేలేశ్, పుజారా అండగా ఉన్నారు. ఆ సమయంలో నా వెంట ఎవరూ లేకుంటే చాలా కష్టమయ్యేది. నేను కెప్టెన్ అయినా సరే ఆ స్థితిలో ఉన్న ఆటగాడిని ఇంటికి వెళ్లమని చెప్పేవాడిని. కానీ అతనికి తోడుగా ఉండటం కోసం ఇతరులను ఏర్పాటు చేసి ఉండకపోవచ్చేమో. ఆ రోజు రోహిత్‌లో గొప్పనాయకుడిని చూశా”
”స్వార్థపూరిత సమాజంలో మరొకరి క్షేమం గురించి ఆలోచించడం చాలా అరుదు. ఆ సంఘటన తర్వాత రోహిత్ శర్మపై గౌరవం మరింత పెరిగింది. కెప్టెన్‌గా అతనిపై గతంలోనూ మంచి గౌరవం ఉండేది. ఆటగాళ్ల కోసం రోహిత్ ఎలాంటి సంకోచం లేకుండా ఆఖరి వరకు నిలబడతాడు. ఓ ఆటగాడి కోసం పది అడుగులు ముందుకు వేస్తాడు. అలాగే అతడి కోసం ఆటగాళ్లు తమ జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు” అని అశ్విన్ పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement