Sunday, April 28, 2024

‘ఫార్ములా-ఈ’కి స్పీడందుకున్న‌ ఏర్పాట్లు.. గ్లోబల్‌ ప్రమాణాలతో ట్రాకు నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ చాంపియన్‌ పోటీలకు రాజధాని భాగ్యనగరం సన్నద్ధమవుతోంది. ఎలక్ట్రానిక్‌ కార్ల సామర్థ్యాన్ని, సత్తాను చాటే ఈ పోటీల కోసం పురపాలక శాఖ, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఫార్ములా -ఈ ట్రాక్‌ నిర్మాణపనులను ఇప్పటికే చేపట్టింది. హైదరాబాద్‌లోని పర్యాటకప్రదేశమైన నెక్లెస్‌ రోడ్డులో 2.8 కిలోమీటర్ల పనులను హెచ్‌ఎండీఏ ప్రారంభించింది. ఈ డిసెంబరు నాటికల్లా ట్రాకును సిద్ధం చేయడంతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్‌ బ్యాటరీ కార్లు గంటకు 180 నుంచి 220 కిలోమీటర్లకుపగా వేగంతో పరుగులు తీసే విధంగా ఈ ట్రాక్‌ను పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

ఫార్ములా- ఈ పోటీల నిర్వహణపై అధ్యయనం కోసం గత నెలలో హెచ్‌ఎండీఏ అధికారుల బృందం దక్షిణకొరియాలో పర్యటించింది. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ( హెచ్‌జీసీఎల్‌) లిమిటెడ్‌ ఎండీ సంతోష్‌ నేతృత్వంలో హెచ్‌ఎండీఏ సీనియర్‌ ఇంజినీర్లు, ప్లానింగ్‌ అధికారులు ఆగస్టులో సియోల్‌లో పర్యటించారు. ప్రస్తుతం సియోల్‌ తరహాలోనే హైదరాబాద్‌లో ట్రాక్‌ ఏర్పాటు చేయడంతో పాటు పోటీలను నిర్వహించేందుకు తాజాగా పనులుప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డులోని 2.8 కిలోమీటర్ల మార్గంలో ట్రాక్‌ ఏర్పాటుచేస్తారు. తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్‌ గార్డెన్‌లోకి వెళ్లేవిధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌లోనుంచి వెనకవైపుఉన్న మింట్‌ కాంపౌండ్‌ మర్రిచెట్టునుంచి ఐమాక్స్‌ థియేటర్‌, ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 17 మలుపులు వచ్చే విధంగా ట్రాక్‌ ప్లాన్‌ రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

ఈ డిసెంబరులోనే డెమో…
ఈ పోటీల్లోపాల్గొనే డ్రైవర్లు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు డ్రైవింగ్‌లో శిక్షన పొంది ఉంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఈ పోటీలకు డిసెంబరు నాటికి ట్రాక్‌ను పూర్తి చేసి డెమో నిర్వహించే అవకాశం ఉంది. పోటీల్లో పాల్గొనే డ్రైవర్లుమొత్తం 40 లూప్స్‌ ( రౌండ్లు) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కారు ఎంత సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసిందనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని చాంపియన్‌ షిప్‌ ఇస్తారు. నగరవాసులు పోటీలను వీక్షించేందుకుగాను ట్రాక్‌ మార్గంలో ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయనున్నారు. వేలాది మంది సందర్శకులు కూర్చొని చూసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయని పురపాలక శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement