Friday, May 3, 2024

IPL : సంజూకి రూ.12లక్ష‌ల వాత‌… ఓట‌మి బాధ‌లో జ‌రిమానా పోటు…

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తొలి ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. హోం గ్రౌండ్ జైపూర్‌లోని స‌వాయ్ మాన్ సింగ్ స్టేడియంలో బుధ‌వారం గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆఖ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. ఓట‌మి బాధ‌లో ఉన్న రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్‌కు ఐపీఎల్ నిర్వాహ‌కులు షాకిచ్చారు. రూ.12 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో రాయ‌ల్స్ స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేయ‌డమే ఇందుకు కార‌ణం.

- Advertisement -

నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్లు పూర్తి చేయ‌డంలో విఫ‌లం కావ‌డంతో ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ప్ర‌కారం జ‌రిమానా విధించారు. ఈ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్లో ఓవ‌ర్ రేటుకు పాల్ప‌డ‌డం ఇదే మొద‌టి సారి కావ‌డంతో కెప్టెన్ అయిన సంజూ శాంస‌న్‌కు రూ.12ల‌క్ష‌ల ఫైన్ వేశారు. రెండోసారి ఇదే త‌ప్పిదానికి పాల్ప‌డితే అప్పుడు కెప్టెన్‌కు రూ.24లక్ష‌లు జ‌రిమానా విధిస్తారు. ఆట‌గాళ్ల మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదంటే రూ.6ల‌క్ష‌లు రెండింటిలో ఏదీ త‌క్కువ అయితే దాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఫైన్ వేస్తారు.

చివ‌రి బంతి వ‌ర‌కూ…

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో రియాన్ ప‌రాగ్ (76; 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), సంజూ శాంస‌న్ (68నాటౌట్; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు హాఫ్ సెంచ‌రీలు బాదారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ఉమేశ్ యాద‌వ్‌, మోహిత్ శ‌ర్మ‌, ర‌షీద్ ఖాన్‌లు త‌లా ఓ వికెట్ సాధించారు.
అనంత‌రం ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆఖ‌రి బంతికి ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి ఛేదించింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో శుభ్‌మ‌న్ గిల్ (72; 44 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం చేశాడు. ఆఖ‌ర్లో ర‌షీద్ ఖాన్ (24నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు) సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో గుజ‌రాత్‌కు విజ‌యాన్ని అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement