Monday, April 29, 2024

రుతురాజ్‌ హ్యాట్రిక్‌ సెంచరీ వృథా… మహారాష్ట్రపై 4 వికెట్ల తేడాతో గెలిచిన కేరళ

రాజ్‌కోట్‌: విజయ్‌ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ వరుసగా మూడో సెంచరీతో మెరిశాడు. అయితే రుతురాజ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఫలించలేదు. శనివారం రాజ్‌కోట్‌లో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీ గ్రూప్‌ డి పోరులో కేరళ చేతిలో మహారాష్ట్ర 4వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 6ఓవర్లలో 22పరుగులకే 2వికెట్లు కోల్పోయిన మహారాష్ట్రను రుతురాజ్‌ 129బంతుల్లో 124పరుగులు చేసి ఆదుకున్నాడు. 9బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో సెంచరీ చేసిన రుతురాజ్‌ రన్‌ రేట్‌ను పెంచే ప్రయత్నంలో 46వ ఓవర్లో అరంగేట్ర సీమర్‌ సురేశ్‌ విశేశ్వర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

దీంతో మహారాష్ట్ర జట్టు చివరి ఐదు ఓవర్లలో 42పరుగులు మాత్రమే చేయగలిగింది. మొత్తంమీద నిర్ణీత 50ఓవర్లలో మహారాష్ట్ర 8వికెట్లకు 291పరుగులు చేసింది. కేరళ సీమర్‌ ఎండీ నిధీష్‌ 49పరుగులిచ్చి 5వికెట్లు పడగొట్టాడు. ఒక్క పరుగు దూరంలో సెంచరీ కోల్పోయిన మహా జట్టు వైస్‌ కెప్టెన్‌ రాహుల్‌ త్రిపాఠి వికెట్‌ కూడా ఉంది. అనంతరం 292పరుగులు లక్ష్య ఛేదనలో కేరళ ఆదిలో తడబాటుకు గురైంది. 10.3ఓవర్లలో 35పరుగులుకే 4వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విష్ణువినోద్‌ 82బంతుల్లో 8ఫోర్లు, 2సిక్స్‌లతో 100పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలుపుబాటలో నిలిపాడు. విష్ణుకు 70బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లతో 71పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన జోసెఫ్‌ అండగా నిలిచాడు. వీరిద్దరూ 174పరుగులు భాగసామ్యం అందించడంతో కేరళ 48.5ఓవర్లలోనే 294పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. మొత్తంమీద కేరళ 48.5ఓవర్లలో 6వికెట్లకు 294పరుగులు చేసి 4వికెట్ల తేడాతో విజయం సాధించింది. జలజ్‌ సక్సేనా (44), సంజూ శాంసన్‌ (42) తమవంతు సహకారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement