Tuesday, April 30, 2024

టీమిండియాకు పాక్‌ షాక్‌!


భారత్‌ 151/7.. పాకిస్తాన్‌ 152/0

అలవోకగా గెలిచిన బాబర్‌ సేన
కనీస ప్రతిఘటన ఇవ్వని కోహ్లీ టీమ్‌
దుబారు వేదికగా ఓటమి చవిచూసిన టీమిండియా
భారత్‌ బౌలింగ్‌ను చితక్కొట్టిన పాక ఓపెనర్లు
ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌పై పాక తొలి విజయం

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ 2021లో ఆదివారం జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో కోహ్లీసేన ఘోరపరాజయాన్ని మూటకట్టుకుంది. దాయాది పాక్‌ భారత్‌పై 10వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దీంతో పాక్‌పై ప్రపంచకప్‌లో భారత్‌కు ఉన్న అజేయ రికార్డు బద్దలైంది. ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌పై పాక్‌ గెలవడం ఇదే తొలిసారి కాగా పాక్‌పై ఓడిపోవడం ఇదే ప్రథమం. భారత్‌ నిర్దేశించిన 152పరుగుల లక్ష్యాన్ని పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ 52బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లతో 68పరుగులు, మరో ఓపెనర్‌ రిజ్వాన్‌ 55బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లతో 79పరుగులు చేసి 17.5ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి అజేయంగా నిలిచారు. 4ఓవర్లలో 31పరుగులిచ్చి 3వికెట్లు పడగొట్టిన పాక్‌ పేసర్‌ షాహిన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.
కోహ్లీ అర్ధశతకం వృథా
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో కేఎల్‌ రాహుల్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించారు. రాహుల్‌ స్ట్రైక్‌ తీసుకోగా పాక్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను షాహీన్‌ అఫ్రిదీ ప్రారంభించాడు. మూడో బంతికి సింగిల్‌ తీసిన రాహుల్‌ టీమిండియా పరుగుల ఖాతాను తెరిచాడు. అయితే అనూహ్యంగా తర్వాత బంతికే అఫ్రిది రోహిత్‌శర్మ (0)ను డకౌట్‌ చేశాడు. షహీన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన రోహిత్‌ గోల్డెన్‌ డక్‌గా పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. కేవలం ఒక పరుగుకే కోహ్లీసేన కీలక వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. తొలి ఓవర్‌ ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 2పరుగులు చేసింది. లెఎఅ్టార్మ్‌ స్పిన్నర్‌ ఇమాద్‌ వసీం క్రీజులోకి వచ్చాడు. రెండో ఓవర్‌ తొలి బంతిని షార్ట్‌ఫైన్‌ లెగ్‌దిశగా ఆడిన కోహ్లీ సింగిల్‌ తీసి వ్యక్తిగత పరుగుల ఖాతా తెరిచాడు. ఈ ఓవర్లో 4పరుగులు రావడంతో భారత్‌ స్కోరు 6/1కు చేరింది. మూడో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన షహీన్‌ ఈసారి తొలి బంతికే రాహుల్‌ (3) క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 6పరుగులకే కోహ్లీసేన 2వ వికెట్‌ కోల్పోయింది. కుడిచేతివాటం బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు. మూడో ఓవర్‌ చివరిబంతిని సూర్యకుమార్‌ బ్యాక్‌వర్డ్‌ స్కేర్‌లెగ్‌ దిశగా సిక్సర్‌ బాదడంతో భారత్‌ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. 3ఓవర్లకు స్కోరు 14/2నమోదైంది. 4వ ఓవర్లో ఇమాద్‌ వేసిన చివరిబంతిని సూర్య బౌండరీకి తరలించడంతో ఈ ఓవర్లో 7పరుగులు లభించాయి. 5వ ఓవర్లో షాహీన్‌ బౌలింగ్‌లో ఐదోబంతిని సిక్సర్‌గా మలిచాడంతో ఈ ఓవర్లో 9పరుగులు వచ్చాయి. కుడిచేతివాటం పేసర్‌ హసన్‌ అలీ బౌలింగ్‌కు దిగి సూర్యను అడ్డుకున్నాడు. 8బంతుల్లో ఓ ఫోరు, ఓ సిక్సర్‌తో 11పరుగులు చేసిన సూర్య..హసన్‌అలీ బౌలింగ్‌లో కీపర్‌ రిజ్వాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈక్రమంలో రిషభ్‌పంత్‌ క్రీజులోకి వచ్చాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి భారత్‌ 3వికెట్లు కోల్పోయి 36పరుగులు చేసింది. పంత్‌తో జత కట్టిన కోహ్లీ మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడటంతో 10ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌స్కోరు 60/3 నమోదైంది. ఈ దశలో 19బంతుల్లో 19పరుగులు చేసిన పంత్‌, 24బంతుల్లో 26పరుగులు చేసిన కోహ్లీ క్రీజులో ఉన్నారు.
పంత్‌ సింగిల్‌హ్యాండ్‌ సిక్సర్లు
11వ ఓవర్లో హసన్‌అలీ బౌలింగ్‌లో రెండో బంతిని పంత్‌ సింగిల్‌ హ్యాండ్‌తో స్వీప్‌షాట్‌ ఆడి డీప్‌స్కేర్‌మీదుగా సిక్సర్‌ బాదాడు. ఆ తర్వాత బంతిని లాంగాఫ్‌ మీదుగా సింగిల్‌ హ్యాండ్‌తో మరో సిక్సర్‌ బాదడంతో భారత్‌ శిబిరంలో ఆనందం పెల్లుబుకింది. ఈ ఓవర్లో హసన్‌అలీ 15పరుగులు సమర్పించుకోవడంతో 11ఓవర్లుకు కోహ్లీసేన 3వికెట్లకు 81పరుగులు స్కోరు చేసింది. అయితే 12వ ఓవర్లో షాదాబ్‌ బౌలింగ్‌కు దిగి జోరుమీదున్న పంత్‌ను అడ్డుకున్నాడు. 30బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లుతో 39పరుగులు చేసిన పంత్‌..షాదాబ్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 84పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్‌ కోహ్లీ అలుపెరగకుండా పోరాటం చేయడంతో 15ఓవర్లుకు స్కోరు 4వికెట్లకు 100పరుగులతో సెంచరీ మార్కును చేరుకుంది. ఆ తర్వాత ఓవర్లో కోహ్లీ హసన్‌అలీ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదడంతో 16వ ఓవర్లో 10పరుగులు భారతఖాతాలో చేరాయి. అనంతరం 18వ ఓవర్లో హసన్‌అలీ బౌలింగ్‌లో రెండో బంతిని బౌండరీకి తరలించిన కోహ్లీ అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ఈక్రమంలో టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక హాఫ్‌సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ(10) నిలిచాడు. కోహ్లీ తర్వాత 9 అర్ధశతకాలతో విండీస్‌ సుడిగాలి గేల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే ఓవర్లో ఐదో బంతిని షాట్‌కు ఆడబోయిన జడేజా (13) సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ నవాజ్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చాడు. 125పరుగుల వద్ద భారత్‌ ఐదో వికెట్‌ పడింది. కుడిచేతివాటం బ్యాటర్‌ హార్దిక్‌ పాండ్య క్రీజులోకి వచ్చాడు. ఆది నుంచి భారత్‌ను దెబ్బతీస్తున్న షాహీన్‌ 19వ ఓవర్లో మరోసారి చెలరేగిపోయాడు. ఈసారి కెప్టెన్‌ కోహ్లీని ఔట్‌ చేశాడు. 49బంతుల్లో 5ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57పరుగులు చేసిన కోహ్లీ..షాహిన్‌ అఫ్రిదీ బౌలింగ్‌లో రిజ్వాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 133పరుగుల వద్ద భారత్‌ 6వ వికెట్‌ కోల్పోయింది. భారత్‌ ఇన్నింగ్స్‌ తుది అంకానికి చేరుకుంది. చివరి ఓవర్‌ వేసేందుకు హరీస్‌ రౌఫ్‌ బరిలోకి దిగాడు. రెండో బంతిని మిడ్‌వికెట్‌ మీదుగా షాట్‌ ఆడబోయిన హార్దిక్‌పాండ్య పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చాడు. 8బంతుల్లో 2ఫోర్లుతో 11పరుగులు చేసిన హార్దిక్‌ పెవిలియన్‌కు చేరుకున్నాడు. మొత్తంమీద కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లకు 151పరుగులు చేసింది. భువీ (5), షమీ (0) నాటౌట్‌గా నిలిచారు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ 3వికెట్లు, హసన్‌ అలీ 2వికెట్లు తీయగా షాదాబ్‌, హరీస్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.
బాబర్‌, రిజ్వాన్‌ వీరబాదుడు
భారత్‌ నిర్దేశించిన 152పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌, రిజ్వాన్‌ బరిలోకి దిగారు. భువనేశ్వర్‌ బౌలింగ్‌కు ప్రారంభించగా తొలి ఓవర్లోనే రిజ్వాన్‌ ఓ బౌండరీ, సిక్సర్‌తో చెలరేగిపోవడంతో ఈ ఓవర్లో 10పరుగులు వచ్చాయి. రెండో ఓవర్లో షమీ 8పరుగులివ్వగా మూడో ఓవర్లో బుమ్రా కేవలం 4పరుగులే ఇచ్చాడు. పవర్‌ప్లే ముగిసేసరికి పాకిస్థాన్‌ వికెట్‌ నష్టపోకుండా 43పరుగులు చేసింది.బాబర్‌ 17బంతుల్లో 17పరుగులు, రిజ్వాన్‌ 19బంతుల్లో 25బంతుల్లో క్రీజులో ఉన్నారు. పాక్‌ ఓపెనింగ్‌ జోడీ భారత్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో పాక్‌ స్కోరు పరుగులు పెట్టింది. 12ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్‌ స్కోరు వికెట్‌ నష్టపోకుండా 85పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్లో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో రిజ్వాన్‌ సిక్సర్‌బాదగా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ నాలుగో బంతిని సిక్సర్‌ బాది హాఫ్‌సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 13వ ఓవర్లో 16పరుగులు రావడంతో స్కోరు వికెట్‌ నష్టపోకుండా సెంచరీ మార్కుదాటి 101/0కు చేరింది. 15వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో రెండో బంతిని బౌండరీ బాదిన రిజ్వాన్‌కూడా హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18వ ఓవర్లో షమీ వేసిన ఫుల్‌టాస్‌ను సిక్సర్‌ బాదాడు. తరువాత బంతిని బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌ మీదుగా బౌండరీకి తరలించాడు. మూడో బంతిని లాంగాన్‌ మీదుగా మరో బౌండరీ బాదాడు. ఈ జోరులో 17.5 ఓవర్లలోనే పాక్‌ 152 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించి 10వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ను కుప్పకూల్చడం కీలకపాత్ర పోషించిన షాహీన్‌ అఫ్రిది ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

స్కోరుబోర్డు
ఇండియా ఇన్నింగ్స్‌
కేఎల్‌ రాహుల్‌ (బి) షాహీన్‌ 3, రోహిత్‌శర్మ (ఎల్బీ) షాహీన్‌ 0, కోహ్లీ (సి) రిజ్వాన్‌ (బి) షాహిన్‌ 57, సూర్యకుమార్‌ (సి) రిజ్వాన్‌ (బి) హసన్‌అలీ 11, పంత్‌ (సి అండ్‌ బి) 39, జడేజా (సి) నవాజ్‌ (బి) హసన్‌అలీ 13, హార్దిక్‌ (సి) బాబర్‌ (బి) హరీస్‌ రౌఫ్‌ 11, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 5, షమీ (0) నాటౌట్‌ 0. ఎక్స్‌ట్రాలు 12. మొత్తం: 151 (7వికెట్లు. 20ఓవర్లు). వికెట్ల పతనం: 1-1, 6-2, 31-3, 84-4, 125-5, 133-6, 146-7. బౌలింగ్‌: షాహీన్‌ 4-0-31-3, ఇమాద్‌ 2-0-10-0, హసన్‌అలీ 4-0-44-2, షాదాబ్‌ 4-0-22-1, హాఫీజ్‌ 2-0-12-0, హరీస్‌రౌఫ్‌ 4-0-25-1.
పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌
రిజ్వాన్‌ (నాటౌట్‌) 79, బాబర్‌ (నాటౌట్‌) 68. ఎక్స్‌ట్రాలు 5. మొత్తం: 152 (0వికెట్లు. 17.5ఓవర్లు). బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-25-0, షమీ 3.5-043-0, బుమ్రా 3-0-22-0, వరుణ్‌ 4-0-33-0, జడేజా 4-0-28-0.

Advertisement

తాజా వార్తలు

Advertisement