Saturday, April 27, 2024

Follow up : విండీస్‌లో విక్టరీ.. చరిత్ర సృష్టించిన ధావన్‌ బృందం..

వెస్టిండీస్‌ గడ్డపై భారత్‌ చరిత్ర సృష్టించింది. ఆ జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత్‌ జయభేరి మోగించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో వర్షం దోబూచులాడినప్పటికీ భారత్‌ 119 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు అంతకన్నా మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ విండీస్‌ గడ్డపై గెలవడం గడచిన 39 ఏళ్లలో ఇదే తొలిసారి. పైగా క్లీన్‌ స్వీప్‌ చేయడం ఇదే మొదటిసారి. ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌ శిఖర ధావన్‌ కావడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌కు వచ్చిన వెస్టిండీస్‌ జట్టుపై భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు భారత్‌ ఇప్పటివరకు 13 సార్లు వన్డేల్లో వివిధ జట్లపై క్లీన్‌స్పీవ్‌ చేసింది. విదేశీ గడ్డపై క్లీన్‌ స్వీప్‌ చేయడం ఇది ఐదోసారి. అంతకుముందు 2013, 15, 16లో జింబాబ్వేలోను, 2017లో శ్రీలంకలోనూ, ఇప్పుడు వెస్టిండీస్‌లోనూ ఆ ఫీట్‌ సాధించింది. బుధవారంనాటి వన్డే మ్యాచ్‌లోవర్షం అంతరాయం కారణంగా 36 ఓవర్లకే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో యజువేంద్ర చాహల్‌ నాలుగు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక శుభ్‌మన్‌ గిల్‌ 98 పరుగులు చేసి భారత్‌కు గట్టి పునాది వేశాడు. ఒకే ఏడాది ఒకే జట్టుపై రెండుసార్లు క్లీన్‌ స్వీప్‌ చేసిన మూడో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. గతంలో జింబాబ్వే, బంగ్లాదేస్‌ ఆ ఘనత సాధించాయి. 2001లో బంగ్లాదేశ్‌పై తమ గడ్డపై జింబాబ్వే 4-0తో, బంగ్లాదేశ్‌లో 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక బంగ్లాదేశ్‌ జట్టు కెన్యాపై 3-0తో ఆ దేశంలోను, స్వదేశంలోనూ క్లీన్‌ స్వీప్‌ చేసింది. కాగా వెస్టిండీస్‌లో వన్డే సిరీస్‌ గెలిచిన కెప్టెన్లు సౌరవ్‌ గంగూలీ, ధోని, సురేశ్‌ రైనా, విరాట్‌ కోహ్లీ సరసన శిఖర్‌ ధావన్‌ చేరాడు. 2002లో 2-1 తేడాతో తొలిసారిగా సౌరవ్‌ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు సిరీస్‌ను నెగ్గింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement