Monday, May 6, 2024

హాకీ ఆసియా కప్‌, ఫైనల్‌కు చేరని భారత్‌.. ద.కొరియాతో మ్యాచ్‌ డ్రా

హాకీ క్రీడాభిమానులకు ఇది బ్యాడ్‌ న్యూస్‌. లీగ్‌ స్టేజీల్లో ఎంతో బాగా రాణించిన ఇండియన్‌ యంగ్‌ హాకీ జట్టు.. సూపర్‌ 4లో గట్టి పోటీ ఇచ్చినా.. ఆసియా కప్‌ టైటిల్‌ ఫైనల్‌ పోరు నుంచి బయటికొచ్చేసింది. మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండియన్‌ ప్లేయర్స్‌ ఎంతో బాగా రాణించినా.. ఫలితం లేకుండా పోయింది. 4-4 గోల్స్‌తో మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో.. ఆసియా కప్‌ ఫైనల్‌ టైటిల్‌ రేసులో లేకుండా పోయింది. జపాన్‌పై మలేషియా 5-0 గోల్స్‌ తేడాతో భారీ విజయం సాధించడంతో భారత్‌ ఆశలు అడియాశలయ్యాయి. సూపర్‌ – 4 స్టేజీలో ఇండియా, మలేషియా, కొరియాలు ఐదు పాయింట్లతో ముగిశాయి. బీరేంద్ర లక్రా జట్టు గోల్‌ తేడాతో వెనుకబడిపోయింది. భారత్‌ తరఫున నీలం 9వ నిమిషంలో, దిప్సన్‌ టిర్కే 21వ నిమిషంలో, మహేష్‌ షేష్‌ గౌడ 22వ నిమిషంలో, శక్తివెల్‌ మరీశ్వరన్‌ 37వ నిమిషంలో గోల్స్‌ చేశారు. అయితే కొరియా కూడా భారత్‌కు గట్టి పోటీ ఇచ్చింది. జంగ్‌ 13వ నిమిషంలో, జీ వూ చియోన్‌ 18వ నిమిషంలో, కిమ్‌ జుంగ్‌హు 28వ నిమిషంలో, జుంగ్‌ మంజా 44వ నిమిషంలో గోల్స్‌ చేశారు.

వెంటాడిన దురదృష్టం..

దక్షిణ కొరియా జట్టుపై భారత్‌ భారీ గోల్స్‌ తేడాతో గెలిచి ఉంటే.. ఫైనల్‌కు వెళ్లేది. అయితే మ్యాచ్‌ డ్రా కావడంతో ఆసియా కప్‌ ఫైనల్‌ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. బుధవారం మలేషియా, దక్షిణ కొరియా జట్ల మధ్య ఫైనల్‌ ఉంటుంది. మూడు, నాల్గో స్థానం కోసం భారత్‌, జపాన్‌ జట్లు తలపడుతాయి. మొదటి క్వార్టర్స్‌లో భారత్‌, కొరియా జట్లు పైచేయి సాధించడానికి ప్రయత్నించాయి. రెండో నిమిషంలోనే భారత్‌కు పెనాల్టిd కార్నర్‌ లభించగా.. నీలం సంజీవ్‌ గోల్‌ను కొరియా గోల్‌ కీపర్‌ జేహియోన్‌ కిమ్‌ అడ్డుకున్నాడు. 9వ నిమిషంలో లభించిన పెనాల్టిd కార్నర్‌ను ఈసారి నీలం సద్వినియోగం చేసుకుని గోల్‌గా మలుచుకున్నాడు. దీంతో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తరువాత కొరియా వరుసగా రెండు గోల్స్‌ చేయడంతో 2-1 ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తరువాత ఇరు జట్లు హోరాహోరీగా పోరాడి.. స్కోర్‌ను 4-4 వద్దకు తీసుకొచ్చాయి. అయితే సమయం ముగియడంతో.. మ్యాచ్‌ డ్రా అయ్యింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement