Monday, May 6, 2024

Gujatath vs Mumbai – ఫైన‌ల్ కు నువ్వా… నేనా..

న్యూఢిల్లి: ఐపీఎల్‌-16 సీజన్‌లో నేడు మరొక రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌కోసం
గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండి యన్స్‌ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు టైటిల్‌ కోసం నాలుగుసార్లు చాంపియన్‌ అయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆదివారం జరిగే ఫైనల్‌లో తలపడు తుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై రెండు సార్లు నెగ్గగా, గుజరాత్‌ ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. చివరిసారి ఇరుజట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ను ముంబై ఇండియన్స్‌ 27 పరుగుల తేడాతో ఓడించింది.

ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మరపురాని విజయాలను సొంతం చేసుకుంది. లీగ్‌దశ ముగిసే సరికి హేమాహేమీలను దాటేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం ఆక్రమించింది. అయితే, మే 23న చెపాక్‌ వేదికపై జరి గిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఉత్కంఠ పోరులో హార్దిక్‌పాండ్యా బృందం లక్ష్యఛేదనలో చతికిలపడింది. చివరకు 15 పరుగుల తేడాతో ఓడింది. ధోనీసేన చేతిలో తొలి ఓటమి నమోదు చేసుకుంది. ముంబై ఇండియన్స్‌ విషయానికొస్తే, పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంతో లీగ్‌దశను ముగించుకుంది. సీజన్‌ ప్రారంభంలో కొన్ని పేలవ ప్రదర్శనలు చేసినప్పటికీ, ఆ తర్వాత రోహిత్‌సేన పుంజుకుంది. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుచేసింది. 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తదుపరి పోరుకు ఆత్మవిశ్వాసంతో ఉంది.

మార్పులు.. చేర్పులు..
కాగా, లీగ్‌ దశలో అందరికంటే ముందంజలో ఉండీ, క్వాలిఫయర్‌ -1లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడటాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ జీర్ణించుకోలేకుంది. కిందటి మ్యా చ్‌లో లోపాలు, బలహీనతల్ని అధిగమించేలా తుది జట్టును ఎంపిక చేయనుంది. ఈ క్రమంలో కొన్ని కీలక మార్పులు అనివార్యమని తెలుస్తోంది. కీలక పోరులో ఫామ్‌ లోకి వచ్చిన ముంబై ఇండియన్స్‌ ఒకటీ అరా మార్పులతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 5 వికెట్లతో అదరగొట్టిన ఆకాశ్‌ మధ్వాల్‌ నేటి మ్యాచ్‌ లోనూ ముంబైకి కీలక ప్లేయర్‌ కానున్నాడు.

పిచ్‌ రిపోర్టు:
నరేంద్ర మోడీ స్టేడియంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో బౌలింగ్‌కు కూడా అనుకూలిస్తుంది. మ్యాచ్‌ ప్రారంభంలో పిచ్‌ కొద్దిసేపు సీమర్లకు మద్దతిస్తుంది. బంతి స్వింగ్‌ అయ్యేందుకు చాన్స్‌ ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా బ్యాటింగ్‌ పిచ్‌గా మారుతుంది. ఇక మైదానంలో బౌండరీ లైన్‌ పరిధి తక్కువగా ఉన్నందున, భారీస్కోర్లకు ఆస్కారం ఉంటుంది. పైగా ఔట్‌ఫీల్డ్‌ వేగంగా ఉంటుంది. ఈ మైదానంలో రెండవసారి బ్యాటింగ్‌ చేసిన జట్టు ఎక్కువసార్లు విజ యం సాధించింది. అందుచేత టాస్‌ నెగ్గిన జట్టు కెప్టెన్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 180 పరుగులు.

- Advertisement -

గుజరాత్‌ జట్టు (అంచనా):
శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా, హార్దిక్‌ పాండ్యా, విజయ్‌ శంకర్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ఖాన్‌, జాషువా లిటిల్‌, మోహిత్‌శర్మ, నూర్‌ అహ్మద్‌, మహ్మద్‌ షమి.

ముంబై జట్టు (అంచనా):
ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌శర్మ, కామెరూన్‌ గ్రీన్‌, సూర్యకుమార్‌, తిలక్‌వర్మ, టిమ్‌ డేవిడ్‌, క్రిస్‌ జోర్డాన్‌, షోకీన్‌, పీయూష్‌ చావ్లా, జాసన్‌ బెహ్రెండార్ఫ్‌, ఆకాశ్‌ మధ్వాల్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement