Saturday, May 4, 2024

భరత్‌ భారీ శతకం.. హిమాచల్‌ప్రదేశ్‌పై గెలిచిన ఆంధ్రప్రదేశ్ జ‌ట్టు..

ముంబై: విజయ్‌ హజారే ట్రోఫీ గ్రూప్‌-ఎలో హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌ అదరగొట్టాడు. భారీ శతకంతో మెరిశాడు. భరత్‌ 161పరుగుల భారీ శతకంతోపాటు ఓపెనర్‌ అశ్విన్‌ హెబ్బార్‌ 100 సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ శతకాలతో కదం తొక్కడంతో హిమాచల్‌ప్రదేశ్‌పై ఏపీ జ‌ట్టు 30పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హిమాచల్‌ప్రదేశ్‌ బౌలింగ్‌ ఎంచుకుని ఏపీని బ్యాటింగ్‌కు ఆహానించింది. ఓపెనర్‌ జ్ఞానేశ్వర్‌ (16) నిరాశపరిచినా మరో ఓపెనర్‌ హెబ్బార్‌ 132బంతుల్లో 10ఫోర్లుతో 100పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. అయితే వన్‌డన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీకర్‌ భరత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో 109బంతుల్లో 16ఫోర్లు, 8సిక్సర్ల సాయంతో 161పరుగులు చేసి భారీ సెంచరీ నమోదు చేశాడు.

రాయుడు 34పరుగులు చేసి రిషిధావన్‌ బౌలింగ్‌లో శుభం అరోరాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మొత్తంమీద ఏపీ నిర్ణీత 50ఓవర్లలో 4వికెట్లకు 322పరుగులు చేసింది. హిమాచల్‌ బౌలర్లలో కెప్టెన్‌ రిషిధావన్‌, అర్పిత్‌ గులేరియా చెరో వికెట్‌ తీయగా, మయాంక్‌ డాగర్‌ 2వికెట్లు తీశాడు. అనంతరం 323పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్‌ప్రదేశ్‌ 46 ఓవర్లలో 292పరుగులు చేసి ఆలౌటైంది. 70బంతుల్లో 7ఫోర్లుతో 51పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్‌ ప్రశాంత్‌ చోప్రా రనటయ్యాడు. కెప్టెన్‌ రిషీధావన్‌ 61బంతుల్లోనే 7ఫోర్లు, 2సిక్సర్లతో 79పరుగులు చేసి గిరినాథ్‌ రెడ్డికి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఓపెనర్‌ శుభం అరోరా (34), అమిత్‌కుమార్‌ (43), ఆకాష్‌ వసిష్ట్‌ (24) ఫరాలేదనిపించినా మిగిలిన బ్యాటర్ల సహకారం లేకపోవడంతో 46ఓవర్లలో 292పరుగులకే హెచ్‌పీ కుప్పకూలింది. ఏపీ బౌలర్లలో గిరినాథ్‌ రెడ్డి 4, నితీశ్‌రెడ్డి 2, సాయితేజ, విజయ్‌ చెరో వికెట్‌ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement