Thursday, May 16, 2024

Delhi | హస్తినకు వైఎస్ షర్మిల.. విభజన హామీలపై పోరాటం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రజా సమస్యలపై గళమెత్తుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం హస్తిన బాట పట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో పొందుపర్చిన హామీల అమలు కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలిసేందుకు ఆమె ఈ పర్యటన చేపడుతున్నారు. అలాగే తమ పోరాటానికి మద్దతివ్వాల్సిందిగా ఇతర జాతీయ పార్టీల నేతలను కూడా ఆమె కలవనున్నారు. ఏపీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు ఈ విషయం వెల్లడించారు.

బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రయోజనాలు కాపాడాలన్న నినాదంతో జాతీయ నాయకులను కలిసేందుకు షర్మిల ఢిల్లీ వస్తున్నట్టు ఆయన తెలిపారు. విభజన హామీల అమలు కోసం కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం) సహా ఏపీకి సంఘీభావంగా ఉన్న పార్టీ నేతలను ఆమె కలుస్తారని వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న అంశాలన్నింటినీ బడ్జెట్‌లో పొందుపరచాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తున్నామని కేంద్రమంత్రులకు తెలియజేస్తూ వినతి పత్రాలు అందించనున్నారని తెలిపారు.

మరోవైపు ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అని గిడుగు రుద్రరాజు విమర్శించారు. ఈ ముగ్గురూ రాష్ట్ర ప్రయోజనాలకి విరుద్ధంగా పనిచేస్తున్నారని నిందించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు సహా విభజన హామీలేవీ కేంద్రం ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏదైనా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుందని, కానీ బీజేపీ మాత్రం వాటిని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ ఏపీకి అన్యాయం చేశారని విమర్శించారు.

రాజధాని నిర్మిస్తామని చెప్పి మట్టి, నీరు ఇచ్చారని, కానీ ఇంతవరకు రాజధాని గురించి ఎలాంటి చర్యలూ లేవని అన్నారు. దుగరాజపట్నం పోర్టు, విద్యాసంస్థలను ఏర్పాటు కూడా పూర్తికాలేదని అన్నారు. వీటన్నింటిపై ఏపీ కాంగ్రెస్ పోరాడుతుందని, అయితే ధర్నాలు, నిరసనల రూపంలో ప్రదర్శనలు చేసే ఆలోచన మాత్రం తమకు లేదని గిడుగు అన్నారు. శాంతియుతంగా పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలను కలిసి వినతి పత్రాలు మాత్రం అందజేస్తామని వివరించారు. ఏపీ ప్రయోజనాల కోసమే షర్మిల నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారని వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement