Tuesday, April 30, 2024

Big Story : ప్లాస్టిక్‌ నిషేధం ఏదీ..? అమలు కాని ప్రభుత్వ ఆదేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ప్లాస్టిక్‌ నిషేధం అమలుకు నోచుకోని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధించినా ఆ ఆంక్షలు మాత్రం రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. కేంద్రప్రభుత్వం ప్లాస్టిక్‌ నిషేధాన్ని విధించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా బహిరంగ మార్కెట్లో ప్లాస్టిక్‌ సంచులు, గ్లాసులు, ఇతర ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్లాస్టిక్‌ వినియోగంలో ఉన్న దుష్ప్రలితాలపై వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహించడం విమర్శలకు దారి తీస్తుంది. ముఖ్యంగా దుకాణాదారులతో సమావేశాలు నిర్వహించకపోవడంతో ప్లాస్టిక్‌ వినియోగం యధావిధిగా కొనసాగుతూనే ఉంది.

- Advertisement -

పర్యావరణ పరిరక్షణలో కీలకమైన ప్లాస్టిక్‌ నిషేధంపై సమిష్టిగా అవగాహన కల్పించాల్సిన బాధ్యతను అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు బహిరంగ మార్కెట్లో ఎప్పటిలాగానే విచ్చలవిడిగా సాగుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధ అమలు బాధ్యతలను మున్సిపల్‌, పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం నామమాత్రపు తనిఖీలు చేస్తూ ప్రభుత్వ ఆశయానికి గండి కొడుతున్నారు. అక్కడక్కడ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వానికి లెక్కలు చూపుతున్నా అనధికారికంగా కాసుల దందా చేస్తున్నారన్న ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ ల పరిధిలో సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. గుంటూరు, విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి కార్పొరేషన్‌లలో ఈ ప్లాస్టిక్‌ నిషేధం కాసులు కురిస్తుందన్న విమర్శలు పర్యావరణ ప్రేమికులు, సామాజికవేత్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి. సాధారణ స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ నామమాత్రపు జరిమానాలు వేస్తున్నారని అనధికారికంగా కేసులు నమోదు చేయకుండా పెద్దఎత్తున సొమ్ములు కూడగట్టుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని ముందే ప్రధాన వ్యాపారస్థులకు అందిస్తూ కవర్ల విక్రయాలకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు పెద్దఎత్తున ఉన్నాయి. ముఖ్యంగా చిరు వ్యాపారులపై అధికారులు జులుం ప్రదర్శిస్తూ ఫైన్‌లు వేయడం చర్చకు దారి తీస్తుంది. ఇదే సమయంలో పెద్దపెద్ద వ్యాపారుల నుంచి మామూళ్లు తీసుకుంటూ అక్కడక్కడ మాత్రమే కేసులు పెట్టడం కూడా విమర్శలకు దారి తీస్తోంది.

పల్లెల్లో కానరాని నిషేధం

ఇదిలా ఉంటే ప్లాస్టిక్‌ నిషేధం పల్లెల్లో ఎక్కడా కానరాని పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తనిఖీలు ఏమాత్రం లేకపోవడంతో నిషేధం అమలు కావడం లేదు. పల్లెల్లో నిషేధ బాధ్యతలను పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం అప్పగించినా వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదు. దీంతో ప్లాస్టిక్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. చిన్న బడ్డీ కొట్ల మొదలు కిరాణా షాపులు, మాంసం విక్రయ కేంద్రాల్లో ప్రభుత్వం నిషేధించిన క్యారీబ్యాగ్‌ల వినియోగం పెద్దఎత్తున సాగుతోంది.

తయారీ సంస్థలపై చర్యలు శూన్యం

ప్లాస్టిక్‌ కవర్ల నిషేధ ఉత్తర్వులను అమలు చేయాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అసలు ప్లాస్టిక్‌ ఉత్పత్తులు తయారు చేసే సంస్థల్లో సక్రమంగా తనిఖీలు నిర్వహించకపోవడంతో క్యారీబ్యాగ్‌లు, ఇతర ప్లాస్టిక్‌ ఉత్పత్తులు మార్కెట్లో విచ్చలవిడిగా చెలామణి అవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో షాపులకు కవర్లను విక్రయదారులు భారీగా తరలిస్తున్నా అధికారులు మాత్రం అటువైపుగా ఏమాత్రం దృష్టి సారించడం లేదు. దీంతో ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు గతంలో మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

ప్రభుత్వ ఆదాయానికి గండి

ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలకు సంబంధించిన జరిమానాలు పక్కదారి పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగం వ్యాపారులకు వేసిన జరిమానాలను ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉన్నా ఇది నామమాత్రంగానే ఉంది. అనేక జిల్లాల్లో మొక్కుబడిగా కేసులను నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొందరు అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ జరిమానాలు లేకుండా తమ జేబుల్లోకి అనధికారికంగా సొమ్మును జమ చేసుకుంటున్నారన్న ఆరోపణలు పెద్దఎత్తున ఉన్నాయి. కేసులు తక్కువగా చూపుతూ అనధికారికంగా భారీగా వసూళ్లకు అధికార యంత్రాంగం పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్లాస్టిక్‌ నిషేధ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని ఇదే సమయంలో అధికార యంత్రాంగం అక్రమ వసూళ్లపై దృష్టి సారించాలని ప్రజలు, సామాజికవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement