Monday, April 29, 2024

Delhi | కేటీఆర్ కేంద్ర మంత్రులను కలవడం వెనుక ఆంతర్యం ఏంటి? : మాణిక్ థాకరే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తోనే ఉందని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ థాకరే ఆరోపించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలుగు మీడియాతో మాట్లాడిన మాణిక్ రావ్.. ఇన్నాళ్ల తర్వాత బీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రులను కలవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రాజకీయంగా ఆ పార్టీ బీజేపీతోనే కలిసి నడుస్తోందని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలని అన్నారు. ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయని ఈ భేటీల ద్వారా అర్థమవుతోందని అన్నారు.

రాష్ట్రంలో ఎవరెవరు పొత్తుల్లో ఉన్నారో ప్రజలకు తెలుసని థాకరే వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు మాత్రమే ఇచ్చిందని, అరెస్టు మాత్రం చేయలేదని ఆయనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని, కాంగ్రెస్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని అన్నారు. కాంగ్రెస్‌లో చేరడం కోసం అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారని, తమతో చాలా మంది టచ్‌లో ఉన్నారని మాణిక్ రావ్ థాకరే అన్నారు.

- Advertisement -

అభ్యర్థులను ముందే ప్రకటిస్తాం.. షర్మిల రాకతో పార్టీకి ఎంతో లాభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం కంటే ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని మాణిక్ రావ్ థాకరే అన్నారు. ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన అనేకాంశాలను మీడియాతో పంచుకున్నారు. రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించాలని అనుకుంటున్నామని చెప్పారు. ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా కర్ణాటకలో ఎంతో ప్రయోజనం కలిగిందని, తెలంగాణలోనూ అదే ఫార్ములాతో ముందుకెళ్లి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్సార్టీపీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు సాగిస్తున్నారని ఆయన వెల్లడించారు.

షర్మిల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి చాలా లాభం కల్గుతుందని అన్నారు. తెలంగాణలో నేతల మధ్య విబేధాలు పక్కనపెట్టి అందరూ కలసికట్టుగా పనిచేస్తున్నారని కొనియాడారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పార్టీ కోసం చాలా గట్టిగా పోరాడుతున్నారని ప్రశంసించారు. భట్టి పాదయాత్ర పార్టీకి చాలా ప్రయోజనం కల్గిస్తుందని సూత్రీకరించారు. వాహనం అన్నది ఎక్కకుండా 100 రోజులుగా 1,000 కి.మీ పైగా పాదయాత్ర చేశారని వెల్లడించారు. మరోవైపు ప్రియాంక గాంధీ తెలంగాణపై దృష్టి పెడతారని థాకరే అన్నారు. రెండు మూడు రోజుల్లో తెలంగాణపై ప్రియాంక కార్యాచరణ సిద్ధమవుతుందని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement