Sunday, April 28, 2024

AP: మీ ఆస్తి గొడవలతో మాకేం సంబంధం : చంద్రబాబు సూటిప్రశ్న

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : ఒకరికోసం ఒకరు అన్నట్టు పాదయాత్రలు చేసుకున్న జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు వస్తే అందుకు తామెలా కారణం అవుతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఈరోజు సాయంత్రం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో నిర్వహించిన రా కదలి రా సభలో పాల్గొన్న ఆయన అన్న జగన్ పై షర్మిల విరుచుకుపడడం వెనుక తాను ఉన్నాననే విమర్శలపై ఘాటుగా జవాబు ఇచ్చారు.


చంద్రబాబు మాట్లాడుతూ… నేరాలు చేసి జైలుకు వెళ్లిన జగన్ తరపున పాదయాత్ర చేయాలని షర్మిలకు తాము చెప్పలేదన్నారు. ఆరోజు పోటా పోటీగా పాదయాత్రలు చేసుకున్న వారిమధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి తగాదాలు రేగాయన్నారు. అందుకే రోడ్డెక్కి షర్మిల అన్న జగన్ పై విమర్శలు చేస్తున్నారన్నారు.. ఆ విషయంలో షర్మిల తిరుగుబాటుకు తనకు సంబంధం ఉన్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకప్పుడు అదే అన్నా చెల్లెళ్ళు ఢిల్లీకి తిరిగి అక్కడి పెద్దల కాళ్ళు పట్టుకుని బెయిల్ తెచ్చుకోలేదా అని ప్రశ్నించారు. బెయిల్ కోసం కావాలంటే చనిపోయిన తన తండ్రి వైఎస్సార్ పేరు ను కేసులో పెట్టుకోమని జగన్ అన్నారని చంద్రబాబు విమర్శించారు.

ఇప్పుడు ఆస్తులకు సంబంధించి గొడవలు రావడంతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారని అన్నారు. అధికారం చేజారిపోవడం తప్పదని తెలిసినందుననే అభ్యర్థులను ఒక చోటి నుంచి మరో చోటికి ట్రాన్సఫర్ లు చేసుకుంటున్నారని, ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేసారు. తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని అంటూ అయిదేళ్లలో 20లక్షల మంది యువత కు ఇంటి నుంచే పని చేసుకునే ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు. ఇప్పటిలా ఆరోగ్యం దెబ్బతీసే జె బ్రాండ్ మద్యం కాకుండా మంచి మద్యం సరసమైన ధరలకు అందిస్తామని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాను దోచుకుంటున్న పాపాల పెద్దిరెడ్డిని, దోపిడీదారులైన ఇతర ఎమ్మెల్యేలను ఇంటికి పంపిస్తామని చెప్పారు. వాలంటీర్లను తొలగిస్తామనే ప్రచారాన్ని ఖండిస్తూ ప్రజలకు సేవలు అందించే వారికి ఏమీ కాదని, వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే వారిపై మాత్రం చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. జనసేనతో పొత్తు ఉన్నందున ప్రకటన చేయడం లేదని అంటూ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా ఉన్న డాక్టర్ థామస్ కు మద్దతు ఇవ్వాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement